Literature | Narasimha Shatakam

Narasimha Shatakam is a famous Shatakam in Telugu Literature written by Seshappa Kavi (శేషప్ప కవి) praising the almighty Sri Dharmapuri Laxmi Narasimha Swamy.

1.

సీ. శ్రీమనోహర! సురా - ర్చిత సింధుగంభీర!
భక్తవత్సల! కోటి - భానుతేజ!
కంజనేత్ర! హిరణ్య - కశ్యపాంతక! శూర!
సాధురక్షణ! శంఖ - చక్రహస్త!
ప్రహ్లాద వరద! పా - పధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! - కృష్ణవర్ణ!
పక్షివాహన! నీల - భ్రమరకుంతలజాల!
పల్లవారుణపాద - పద్మయుగళ!

తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ!
కుందకుట్మలదంత! వై - కుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

2.

సీ. పద్మలోచన! సీస - పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య! - చిత్తగింపు
గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక - పఠన లేదు
అమరకాండత్రయం - బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంధముల్ - చదువలేదు
నీ కటాక్షంబున - నే రచించెద గాని
ప్రజ్ఞ నాయది గాదు - ప్రస్తుతింప

తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన - చెడునె తీపు?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

3.

సీ. నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
దురితజాలము లన్ని - దోలవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
బలువైన రోగముల్ - పాపవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ - రింపవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల - దరమవచ్చు

తే. భళిర! నే నీ మహామంత్ర - బలముచేత
దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

4.

సీ. ఆదినారాయణా! - యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి - పాదములకు
సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య - బహువిధముల
ధరణిలో నరులెంత - దండివారైనను
నిన్ను గాననివారి - నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు - మిదుకుచుంచెడివారి
చెంత జేరగనోను - శేషశయన

తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

5.

సీ. ఐశ్వర్యములకు ని - న్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట - దగులలేదు
కనక మిమ్మని చాల - గష్టపెట్టగలేదు
పల్ల కిమ్మని నోట - బలకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు - పొగడలేదు
బలము లిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు
పసుల నిమ్మని పట్టు - పట్టలేదు

తే. నేను గోరిన దొక్కటే - నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

6.

సీ. మందుండనని నన్ను - నింద చేసిననేమి?
నా దీనతను జూచి - నవ్వ నేమి?
దూరభావములేక - తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక - బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత - దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి - చేయనేమి?
తే. కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? - పద్మనాభ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

7.

సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని
పుడమిలో జనుల మె - ప్పులకు గాదు
జన్మపావనతకై - స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతి - ష్థలకు గాదు
ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి - త్తంబు గాదు
నిన్ను బొగడగ విద్య - నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి - కొఱకు గాదు

తే. పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

8.

సీ. శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు - లేనివాడు
పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి
భావమందుత్సాహ - పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ
దత్పరత్వములేక - తలగువాడు
తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా - గడపువాడు

తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు - వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

9.

సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో - మునుగలేను
తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న
బడలి నేమంబు లే - నడపలేను
దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద - ధనములేదు
తపమాచరించి సా - ర్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు - నిలుపలేను

తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను
స్మరణచేసెద నా యధా - శక్తి కొలది.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

10.

సీ. అర్థివాండ్రకు నీక - హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి - దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము - లపహరించుట కంటె
బండ గట్టుక నూత - బడుట మేలు
పరులకాంతల బట్టి - బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల - బడుట మేలు
బ్రతుకజాలక దొంగ - పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు - కొనుట మేలు

తే. జలజదళనేత్ర నీ భక్త - జనులతోడి
జగడమాడెడు పనికంటె - జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!

11.

సీ. గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల - మలయజంబు? శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు? సూకరంబున కేల - చూతఫలము? మార్జాలమున కేల - మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల - కుండలములు? మహిషాని కేల ని - ర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల - పంజరంబు? తే. ద్రోహచింతన జేసెడి - దుర్జనులకు మధురమైనట్టి నీనామ - మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

12.

సీ. పసరంబు వంజైన - బసులకాపరి తప్పు ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు భార్య గయ్యాళైన - బ్రాణనాధుని తప్పు తనయుడు దుష్టయిన - తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన - సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన - మాత తప్పు అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు దంతి దుష్టయిన మా - వంతు తప్పు తే. ఇట్టి తప్పులెఱుంగక - యిచ్చవచ్చి నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

13.

సీ. కోతికి జలతారు - కుళ్లాయి యేటికి? విరజాజి పూదండ - విధవ కేల? ముక్కిడితొత్తుకు - ముత్తెంపు నత్తేల? నద్ద మేమిటికి జా - త్యంధునకును? మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్? క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల? ఱంకుబోతుకు నేల - బింకంపు నిష్ఠలు? వావి యేటికి దుష్ట - వర్తనునకు? తే. మాట నిలుకడ కుంకరి - మోటు కేల? చెవిటివానికి సత్కథ - శ్రవణ మేల? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

14.

సీ. మాన్యంబులీయ స - మర్ధుడొక్కడు లేడు మాన్యముల్ చెఱుప స - మర్ధు లంత యెండిన యూళ్లగో - డెఱిగింప డెవ్వడు బండిన యూళ్లము - బ్రభువు లంత యితడు పేద యటంచు - నెఱిగింప డెవ్వండు కలవారి సిరు లెన్న - గలరు చాల దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు బెఱకాంత ఱంకెన్న - బెద్ద లంత తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి ప్రభువు తప్పు లటంచును - బలుకవలెను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

15.

సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు వెళ్లిపోయెడినాడు - వెంటరాదు లక్షాధికారైన - లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు - మ్రింగబోడు విత్త మార్జనజేసి - విఱ్ఱవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము - తోడరాదు పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి దానధర్మము లేక - దాచి దాచి తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

16.

సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న భిక్ష మర్థిమి జేత - బెట్టలేడు తాను బెట్టకయున్న - తగవు పుట్టదుగాని యొరులు పెట్టగ జూచి - యోర్వలేడు దాతదగ్గఱ జేరి - తన ముల్లె చెడినట్లు జిహ్వతో జాడీలు - చెప్పుచుండు ఫలము విఘ్నంబైన - బలు సంతసమునందు మేలు కల్గిన జాల - మిణుకుచుండు తే. శ్రీరమానాథ! యిటువంటి - క్రూరునకును భిక్షుకుల శత్రువని - పేరు పెట్టవచ్చు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

17.

సీ. తనువులో బ్రాణముల్ = తరళిపొయ్యెడివేళ నీ స్వరూపమును ధ్యా - నించునతడు నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని యముని చేతికి జిక్కి - శ్రమలబడడు పరమసంతోషాన - భజన జేసెడివారి పుణ్య మేమనవచ్చు - భోగిశయన మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని నరక మెక్కడిదయ్య - నళిననేత్ర తే. కమలనాభ నీ మహిమలు - గానలేని తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభంబు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

18.

సీ. నీలమేఘశ్యామ! - నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము - గన్నతల్లి నీ భక్తవరులంత - నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా క - నేకధనము నీ కీర్తనలు మాకు - లోక ప్రపంచంబు నీ సహాయము మాకు - నిత్యసుఖము నీ మంత్రమే మాకు - నిష్కళంకపు విద్య నీ పద ధ్యానంబు - నిత్యజపము తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

19.

సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని మరణకాలమునందు - మఱతునేమొ యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత గంప ముద్భవమంది - కష్టపడుచు నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు బిలుతునో శ్రమచేత - బిలువనొ తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన తలచెదను, జెవి నిడవయ్య! - ధైర్యముగను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

20.

సీ. పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి దెప్పుడో విడుచుట - యెఱుకలేదు శతవర్షములదాక - మితము జెప్పిరి గాని నమ్మరా దామాట - నెమ్మనమున బాల్యమందో మంచి - ప్రాయమందో లేక ముదిమియందో లేక - ముసలియందొ యూరనో యడవినో - యుదకమధ్యముననో యెప్పుడో విడుచుట - యేక్షణంబొ తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

21.

సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ మఱదు లన్నలు మేన - మామగారు ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన దాను దర్లగ వెంట - దగిలి రారు యముని దూతలు ప్రాణ - మపగరించుక పోగ మమతతో బోరాడి - మాన్పలేరు బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని యించుక యాయుష్య - మియ్యలేరు తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

22.

సీ. ఇభరాజవరద! ని - న్నెంత బిల్చినగాని మాఱు పల్క వదేమి - మౌనితనమొ? మునిజనార్చిత! నిన్ను - మ్రొక్కి వేడినగాని కనుల జూడ వదేమి - గడుసుదనమొ? చాల దైన్యమునొంది - చాటు చొచ్చినగాని భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ? స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న దొరకజాల వదేమి - ధూర్తతనమొ? తే. మోక్షదాయక! యిటువంటి - మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి - కడుపునిండు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

23.

సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి రమ్యమొందింప నా - రదుడగాను సావధానముగ నీ - చరణ పంకజ సేవ సలిపి మెప్పంపంగ - శబరిగాను బాల్యమప్పటినుండి - భక్తి నీయందున గలుగను బ్రహ్లాద - ఘనుడగాను ఘనముగా నీమీది - గ్రంథముల్ గల్పించి వినుతిసేయను వ్యాస - మునినిగాను తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

24.

సీ. అతిశయంబుగ గల్ల - లాడనేర్చితిగాని పాటిగా సత్యముల్ - పలుకనేర సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని యిష్ట మొందగ నిర్వ - హింపనేర నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబు - సేయనేర ధనము లియ్యంగ వ - ద్దనగ నేర్చితిగాని శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర తే. బంకజాతాక్ష! నే నతి - పాతకుడను దప్పులన్నియు క్షమియింప - దండ్రి వీవె! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

25.

సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యంతంబు మాయ సంసారంబు - మరగి నరుడు సకల పాపములైన - సంగ్రహించును గాని నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి గుంజుక చని వారు - గ్రుద్దుచుండ హింస కోర్వగ లేక - యేడ్చి గంతులువేసి దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ తే. దన్ను విడిపింప వచ్చెడి - ధన్యు డేడి ముందు నీదాసుడై యున్న - ముక్తి గలుగు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

26.

సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి సత్యవంతులమాట - జన విరోధంబాయె వదరుబోతులమాట - వాసికెక్కె ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి పరమలోభులు ధన - ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి తే. పక్షివాహన! మావంటి - భిక్షుకులకు శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

27.

సీ. భుజబలంబున బెద్ద - పులుల జంపగవచ్చు పాముకంఠము జేత - బట్టవచ్చు బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు మనుజుల రోగముల్ - మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని - చేదు మ్రింగగవచ్చు బదను ఖడ్గము చేత - నదమవచ్చు గష్టమొందుచు ముండ్ల - కంపలో జొరవచ్చు దిట్టుబోతుల నోళ్లు - కట్టవచ్చు తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన - బోధ తెలిపి సజ్జనుల జేయలే డెంత - చతురుదైన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

28.

సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు ముఖ్యుడై నదులందు - మునుగవచ్చు ముక్కుపట్టుక సంధ్య - మొనసి వార్వగవచ్చు దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు వేదాల కర్థంబు - విఱిచి చెప్పగవచ్చు శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు తే. జిత్త మన్యస్థలంబున - జేరకుండ నీ పదాంభోజములయందు - నిలపరాదు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

29.

సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు పెద్ద పోగుల జోళ్లు - పెట్టినట్లు చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు తోరంపు కడియాలు - దొడిగినట్లు మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు చెలువమైన తురాయి - చెక్కినట్లు గళము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు వింతగా గంఠీలు - వేసినట్లు తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణంబు లితర భూషణముల నిచ్చ - గింపనేల. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

30.

సీ. భువనరక్షక! నిన్ను - బొగడనేరని నోరు వ్రజ కగోచరమైన - పాడుబొంద సురవరార్చిత! నిన్ను - జూడగోరని కనుల్ జలములోపల నెల్లి - సరపుగుండ్లు శ్రీరమాధిమ! నీకు - సేవజేయని మేను కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన గఠినశిలాదుల - గలుగు తొలలు తే. పద్మలోచన నీమీద - భక్తిలేని మానవుడు రెండుపాదాల - మహిషమయ్య. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

31.

సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే పసుల నార్జించుట - పాలకొఱకె సతిని బెండ్లాడుట - సంసార సుఖముకే సుతుల బోషించుట - గతులకొఱకె సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె దానమిచ్చుటయు ముం - దటి సంచితమునకే ఘనముగా జదువుట - కడుపు కొఱకె తే. యితర కామంబు గోరక - సతతముగను భక్తి నీయందు నిలుపుట - ముక్తి కొఱకె భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

32.

సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు దారసుతాదులు - తనవెంట రాలేరు భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు బలపరాక్రమ మేమి - పనికి రాదు ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన గోచిమాత్రంబైన - గొనుచుబోడు తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను భజన జేసెడివారికి - బరమసుఖము. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

33.

సీ. నరసింహ ! నాకు దు - ర్ణయములే మెండాయె సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన నన్యకాంతల మీద - నాశ మానగలేను నొరుల క్షేమము చూచి - యోర్వలేను ఇటువంటి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి నేను జేసెడివన్ని - నీచకృతులు నావంటి పాపిష్ఠి - నరుని భూలోకాన బుట్టజేసితి వేల - భోగిశయన ! తే. అబ్జదళనేత్ర! నాతండ్రి - వైన ఫలము నేరములు గాచి రక్షింపు - నీవె దిక్కు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

34.

సీ. ధీరత బరుల నిం - దింప నేర్చితి గాని తిన్నగా నిను బ్రస్తు - తింపనైతి బొరుగు కామినులందు - బుద్ధి నిల్పితి గాని నిన్ను సంతతము ధ్యా - నింపనైతి బెరికిముచ్చట లైన - మురిసి వింటినిగాని యెంచి నీకథ లాల - కించనైతి గౌతుకంబున బాత - కము గడించితిగాని హెచ్చు పుణ్యము సంగ్ర - హింపనైతి తే. నవనిలో నేను జన్మించి - నందు కేమి సార్థకము గానరాదాయె - స్వల్పమైన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

35.

సీ. అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను దలతునో తలపనో - తలతు నిపుడె నరసింహ! నరసింహ! - నరసింహ! లక్ష్మీశ! దానవాంతక! కోటి - భానుతేజ! గోవింద! గోవింద! - గోవింద! సర్వేశ! పన్నగాధిపశాయి! - పద్మనాభ! మధువైరి! మధువైరి! - మధువైరి! లోకేశ! నీలమేఘశరీర! నిగమవినుత! తే. ఈ విధంబున నీనామ - మిష్టముగను భజనసేయుచు నుందు నా - భావమందు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

36.

సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సంపదలన్ని కలుగజేసెడి భార - కర్త వీవె చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి కార మొందించెడి - ఘనుడ వీవె నడక మంచిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి పేరు రప్పించెడి - పెద్ద వీవె బలువైన వైరాగ్య - భక్తిజ్ఞానములిచ్చి ముక్తి బొందించెడు - మూర్తి వీవె తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

37.

సీ. కాయ మెంత భయాన - గాపాడిననుగాని ధాత్రిలో నది చూడ - దక్క బోదు ఏవేళ నేరోగ - మేమరించునొ? సత్త్వ మొందంగ జేయు నే - చందమునను ఔషధంబులు మంచి - వనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాని - విడదు; కోటివైద్యులు గుంపు - గూడివచ్చిన గాని మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు తే. జీవుని ప్రయాణకాలంబు - సిద్ధమైన నిలుచునా దేహ మిందొక్క - నిమిషమైన? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

38.

సీ. జందె మింపుగ వేసి - సంధ్య వార్చిన నేమి బ్రహ్మ మందక కాడు - బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు - వైష్ణవుండు బూదిని నుదుటను - బూసికొనిన నేమి శంభు నొందక కాడు - శైవజనుడు కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు - యతివరుండు తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి - దొరకబోదు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

39.

సీ. నరసింహ ! నే నిన్ను - నమ్మినందుకు జాల నెనరు నాయందుంచు - నెమ్మనమున నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె నింకనైన గటాక్ష - మియ్యవయ్య సంతసంబున నన్ను - స్వర్గమందే యుంచు భూమియందే యుంచు - భోగశయన! నయముగా వైకుంఠ - నగరమందే యుంచు నరకమందే యుంచు - నళిననాభ! తే. ఎచట నన్నుంచిననుగాని - యెపుడు నిన్ను మఱచి పోకుండ నీనామ - స్మరణనొసగు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

40.

సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ - మూఢజనులు సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మాన - జాల రెవరు సర్వకాలము మాయ - సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి నింద జేయక - తాము నిలువలేరు తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

41.

సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుండి బహు గడించితినయ్య - పాతకములు తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి బాధ నొందితి నయ్య - పద్మనాభ అనుభవించెడు నప్పు - దతి ప్రయాసంబంచు బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె నెగిరి పోవుటకునై - యే యుపాయంబైన జేసి చూతమటన్న - జేతగాదు తే. సూర్యశశినేత్ర! నీచాటు - జొచ్చి నాను కలుషములు ద్రుంచి నన్నేలు - కష్టమనక. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

42.

సీ. తాపసార్చిత! నేను - పాపకర్ముడనంచు నాకు వంకలబెట్ట - బోకుచుమ్మి నాటికి శిక్షలు - నన్ను చేయుటకంటె నేడు సేయుము నీవు - నేస్తమనక అతిభయంకరులైన - యమదూతలకు నన్ను నొప్పగింపకు మయ్య - యురగశయన! నీ దాసులను బట్టి - నీవు దండింపంగ వద్దు వద్దన రెంత - పెద్దలైన తే. దండ్రివై నీవు పరపీడ - దగులజేయ వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

43.

సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునందు బుట్టినప్పటినుండి - పుణ్యమెఱుగ నేకాదశీవ్రతం - బెన్న డుండుగ లేదు తీర్థయాత్రలకైన - దిరుగలేదు పారమార్థికమైన - పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైన - బెట్టలేదు జ్ఞానవంతులకైన - బూని మ్రొక్కగలేదు ఇతర దానములైన - నియ్యలేదు తే. నళినదళనేత్ర! నిన్ను నే - నమ్మినాను జేరి రక్షింపవే నన్ను - శీఘ్రముగను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

44.

సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను మృగజాతి కెవ్వడు - మేతబెట్టె వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పించె జెట్ల కెవ్వడు నీళ్ళు - చేదిపోసె స్త్రీలగర్భంబున - శిశువు నెవ్వడు పెంచె ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు మధుపాళి కెవ్వడు - మకరంద మొనరించె బసుల మెవ్వ డొసంగె - బచ్చిపూరి తే. జీవకోట్లను బోషింప - నీవెకాని వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

45.

సీ. దనుజారి! నావంటి - దాసజాలము నీకు కోటి సంఖ్య గలారు - కొదువ లేదు బంట్లసందడివల్ల - బహుపరాకై నన్ను మఱచి పోకుము భాగ్య - మహిమచేత దండిగా భ్రుత్యులు - దగిలి నీకుండంగ బక్కబం టేపాటి - పనికి నగును? నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక యింత వృథాజన్మ - మెత్తినాను తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను గనుక నీ సత్కటాక్షంబు - గలుగజేయు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

46.

సీ. కమలలోచన! నన్ను - గన్నతండ్రివిగాన నిన్ను నేమఱకుంటి - నేను విడక యుదరపోషణకునై - యొకరి నే నాశింప నేర నా కన్నంబు - నీవు నడపు పెట్టలే నంటివా - పిన్న పెద్దలలోన దగవు కిప్పుడు దీయ - దలచినాను ధనము భారంబైన - దలకిరీటము నమ్ము కుండలంబులు పైడి - గొలుసు లమ్ము తే. కొసకు నీ శంఖ చక్రముల్ - కుదువబెట్టి గ్రాసము నొసంగి పోషించు - కపటముడిగి. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

47.

సీ. కువలయశ్యామ! నీ - కొలువు చేసిన నాకు జీత మెందుకు ముట్ట - జెప్పవైతి మంచిమాటలచేత - గొంచెమియ్యగలేవు కలహమౌ నిక జుమ్మి - ఖండితముగ నీవు సాధువు గాన - నింత పర్యంతంబు చనవుచే నిన్నాళ్లు - జరుపవలసె నిక నే సహింప నీ - విపుడు నన్నేమైన శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి తే. నేడు కరుణింపకుంటివా - నిశ్చయముగ దెగబడితి చూడు నీతోడ - జగడమునకు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

48.

సీ. హరి! నీకు బర్యంక - మైన శేషుడు చాల బవనము భక్షించి - బ్రతుకుచుండు ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు గొప్పపామును నోట - గొఱుకుచుండు అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి దినము పేరంటంబు - దిరుగుచుండు నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుండ్రు తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుండు గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

49.

సీ. పుండరీకాక్ష! నా - రెండు కన్నుల నిండ నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య వాసిగా నా మనో - వాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు - చూపవయ్య పాపకర్ముని కంట - బడకపోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ - బట్టినావె? వసుధలో బతిత పా - వనుడ వీ వంచు నే బుణ్యవంతులనోట - బొగడ వింటి తే. నేమిటికి విస్తరించె నీ - కింత కీర్తి ద్రోహినైనను నా కీవు - దొరకరాదె? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

50.

సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబు లోపల నంతట - రోయ రోత నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్త మాంసంబు కండలు - మైల తిత్తి బలువైన యెండ వా - నల కోర్వ దింతైన దాళలే దాకలి - దాహములకు సకల రోగములకు - సంస్థానమె యుండు నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత గాటికే గాని కొఱగాదు - గవ్వకైన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

51.

సీ. పలురోగములకు నీ - పాదతీరమె కాని వలపు మందులు నాకు - వలదు వలదు చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన నీ దాసకోటిలో - నిలుపవయ్య గ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని ఘోరరక్షలు గట్ట - గోరనయ్య పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని దాని మంత్రము నేను - తలపనయ్య తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

52.

సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే బలుగద్దరింపులు - పడగవలసె? దార సుత భ్రమ - దగిలియుండగగదా దేశదేశములెల్ల - దిరుగవలసె? బెను దరిద్రత పైని - బెనగియుండగగదా చేరి నీచులసేవ - చేయవలసె? నభిమానములు మది - నంటియుండగగదా పరుల జూచిన భీతి - పడగవలసె? తే. నిటుల సంసారవారిధి - నీదలేక వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

53.

సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు కవులతో వైరంబు - గాంచ గీడు పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు భిక్షగాండ్రను దుఃఖ - పెట్ట గీడు నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

54.

సీ. పరులద్రవ్యముమీద - భ్రాంతి నొందినవాడు పరకాంతల నపేక్ష - పడెడువాడు అర్థుల విత్తంబు - లపహరించెడువాడు దానమియ్యంగ వ - ద్దనెడివాడు సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు పక్షపు సాక్ష్యంబు - పలుకువాడు విష్ణుదాసుల జూచి - వెక్కిరించెడివాడు ధర్మసాధుల దిట్ట - దలచువాడు తే. ప్రజల జంతుల హింసించు - పాతకుండు కాలకింకర గదలచే - గష్టమొందు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

55.

సీ. నరసింహ! నా తండ్రి - నన్నేలు నన్నేలు కామితార్థము లిచ్చి - కావు కావు దైత్యసంహార! చాల - దయయుంచు దయయుంచు దీనపోషక! నీవె - దిక్కు దిక్కు రత్నభూషితవక్ష! - రక్షించు రక్షించు భువనరక్షక! నన్ను - బ్రోవు బ్రోవు మారకోటిసురూప! - మన్నించు మన్నించు పద్మలోచన! చేయి - పట్టు పట్టు తే. సురవినుత! నేను నీచాటు - జొచ్చినాను నా మొఱాలించి కడతేర్చు - నాగశయన! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

56.

సీ. నీ భక్తులను గనుల్ - నిండ జూచియు రెండు చేతుల జోహారు - సేయువాడు నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పంగ వినయమందుచు జాల - వినెడువాడు తన గృహంబునకు నీ - దాసులు రా జూచి పీటపై గూర్చుండ - బెట్టువాడు నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల దాసోహ మని చేర - దలచువాడు తే. పరమభక్తుండు ధన్యుండు - భానుతేజ! వాని గనుగొన్న బుణ్యంబు - వసుధలోన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

57.

సీ. పక్షివాహన! నేను - బ్రతికినన్నిదినాలు కొండెగాండ్రను గూడి - కుమతినైతి నన్నవస్త్రము లిచ్చి - యాదరింపుము నన్ను గన్నతండ్రివి నీవె - కమలనాభ! మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది బంట్ల దోలుము ముందు - బ్రహ్మజనక! ఇనజభటావళి - యీడిచికొనిపోక కరుణతో నాయొద్ద - గావ లుంచు తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు సేవకుని జేసికొనవయ్య - శేషశయన! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

58.

సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమ - యాజియైన ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన నిత్యసత్కర్మాది - నిరతుడైన నుపవాస నియమంబు - లొందు సజ్జనుడైన గావివస్త్రముగట్టు - ఘనుడునైన దండిషోడశమహా - దానపరుండైన సకల యాత్రలు సల్పు - సరసుడైన తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న మోక్షసామ్రాజ్య మొందడు - మోహనాంగ! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

59.

సీ. పంజరంబున గాకి - బట్టి యుంచిన లెస్స పలుకునే వింతైన - చిలుకవలెను? గార్దభంబును దెచ్చి - కళ్లెమింపుగవేయ దిరుగునే గుఱ్ఱంబు - తీరుగాను? ఎనుపపోతును మావ - టీ డు శిక్షించిన నడచునే మదవార - ణంబువలెను? పెద్దపిట్టను మేత - బెట్టి పెంచిన గ్రొవ్వి సాగునే వేటాడు - డేగవలెను? తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట వాంఛతో జేతురే భక్త - వరులవలెను? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

60.

సీ. నీకు దాసుడ నంటి - నిన్ను నమ్ముకయుంటి గాన నాపై నేడు - కరుణజూడు దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు పద్మలోచన! నేను - పరుడగాను భక్తి నీపై నుంచి - భజన జేసెద గాని పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము దండిదాతవు నీవు - తడవుసేయక కావు ఘోరపాతకరాశి - గొట్టివైచి తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చింత దీర్చు నిరతముగ నన్ను బోషించు - నెనరు నుంచు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

61.

సీ. విద్య నేర్చితి నంచు - విఱ్ఱవీగగలేదు భాగ్యవంతుడ నంచు - బలుకలేదు ద్రవ్యవంతుడ నంచు - దఱచు నిక్కగలేదు నిరతదానములైన - నెఱపలేదు పుత్రవంతుడ నంచు - బొగడుచుండగలేదు భ్రుత్యవంతుడ నంచు - బొగడలేదు శౌర్యవంతుడ నంచు - సంతసింపగలేదు కార్యవంతుడ నంచు - గడపలేదు తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు నళినదళనేత్ర! నిన్ను నే - నమ్మినాను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

62.

సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత తనద్రవ్య మొకరింట - దాచ రోత గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత యొరుల పంచలక్రింద - నుండ రోత భాగ్యవంతునితోడ - బంతమాడుట రోత గుఱిలేని బంధుల - గూడ రోత ఆదాయములు లేక - యప్పుదీయుట రోత జార చోరుల గూడి - చనుట రోత తే. యాదిలక్ష్మీశ! నీబంట - నైతినయ్య! యింక నెడబాసి జన్మంబు - లెత్త రోత. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

63.

సీ. వెఱ్ఱివానికి నేల - వేదాక్షరంబులు? మోటువానికి మంచి - పాట లేల? పసులకాపరి కేల - పరతత్త్వబోధలు? విటకాని కేటికో - విష్ణుకథలు? వదరు శుంఠల కేల - వ్రాత పుస్తకములు? తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ? ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు? దొంగబంటుకు మంచి - సంగ తేల? తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల? ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

64.

సీ. నా తండ్రి నాదాత - నాయిష్టదైవమా నన్ను మన్ననసేయు - నారసింహ! దయయుంచు నామీద - దప్పులన్ని క్షమించు నిగమగోచర! నాకు - నీవె దిక్కు నే దురాత్ముడ నంచు - నీమనంబున గోప గింపబోకుము స్వామి! - కేవలముగ ముక్తిదాయక నీకు - మ్రొక్కినందుకు నన్ను గరుణించి రక్షించు - కమలనాభ! తే. దండిదొర వంచు నీవెంట - దగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహింపు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

65.

సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుండెడివాడు పరుల ముచ్చటమీద - భ్రాంతి పడడు అగణితంబుగ నిన్ను - బొగడ నేర్చినవాడు చెడ్డమాటలు నోట - జెప్పబోడు ఆసక్తిచేత ని - న్ననుసరించెడివాడు ధనమదాంధులవెంట - దగుల బోడు సంతసంబున నిన్ను - స్మరణజేసెడివాడు చెలగి నీచులపేరు - దలపబోడు తే. నిన్ను నమ్మిన భక్తుండు - నిశ్చయముగ గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

66.

సీ. నే నెంత వేడిన - నీ కేల దయరాదు? పలుమాఱు పిలిచిన - బలుక వేమి? పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ మోమైన బొడచూప - వేమి నాకు? శరణు జొచ్చినవాని - సవరింపవలె గాక పరిహరించుట నీకు - బిరుదు గాదు నీదాసులను నీవు - నిర్వహింపక యున్న బరు లెవ్వ రగుదురు - పంకజాక్ష! తే. దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె నమ్మియున్నాను నీపాద - నళినములను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

67.

సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుండైన రణము సాధించెడు - రాజెయైన వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుండైన బరిచగించెడు శూద్ర - వర్యుడయిన మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుండైన బ్రజల కక్కఱపడు - రజకుడైన చర్మ మమ్మెడి హీన - చండాలనరుడైన నీ మహీతలమందు - నెవ్వడైన తే. నిన్ను గొనియాడుచుండెనా - నిశ్చయముగ వాడు మోక్షాధికారి యీ - వసుధలోన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

68.

సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయింపగవచ్చు శూరుడై రణమందు - బోరవచ్చు రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు హేమ గోదానంబు - లియ్యవచ్చు గగనమం దున్న చు - క్కల నెంచగావచ్చు జీవరాసుల పేళ్లు - చెప్పవచ్చు నష్టాంగయోగము - లభ్యసింపగవచ్చు మేక రీతిగ నాకు - మెసవవచ్చు తే. తామరసగర్భ హర పురం - దరులకైన నిన్ను వర్ణింప దరమౌనె - నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

69.

సీ. నరసింహ! నీవంటి - దొరను సంపాదించి కుమతి మానవుల నే - గొల్వజాల నెక్కు వైశ్వర్యంబు - లియ్యలేకున్నను బొట్టకుమాత్రము - పోయరాదె? ఘనముగా దిది నీకు - కరవున బోషింప గష్ట మెంతటి స్వల్ప - కార్యమయ్య? పెట్టజాలక యేల - భిక్షమెత్తించెదు నన్ను బీదను జేసి - నా వదేమి? తే. అమల! కమలాక్ష! నే నిట్లు - శ్రమపడంగ గన్నులకు బండువై నీకు - గానబడునె? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

70.

సీ. వనరుహనాభ! నీ - వంక జేరితి నేను గట్టిగా నను గావు - కావు మనుచు వచ్చినందుకు వేగ - వరము లియ్యకకాని లేవబోయిన నిన్ను - లేవనియ్య గూర్చుండబెట్టి నీ - కొంగు గట్టిగ బట్టి పుచ్చుకొందును జూడు - భోగిశయన! యీవేళ నీ కడ్డ - మెవరు వచ్చినగాని వారికైనను లొంగి - వడకబోను తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి యిప్పుడే నన్ను రక్షించి - యేలుకొమ్ము. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

71.

సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె? మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు? నారదుం డెన్నిచ్చె - నగలు రత్నంబు? ల హల్య నీ కే యగ్ర - హార మిచ్చె? ఉడుత నీ కేపాటి - యూడిగంబులు చేసె? ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె? పంచపాండవు లేమి - లంచ మిచ్చిరి నీకు? ద్రౌపది నీ కెంత - ద్రవ్య మిచ్చె? తే. నీకు వీరంద ఱయినట్లు - నేను గాన? యెందు కని నన్ను రక్షింప - విందువదన! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

72.

సీ. వాంఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి భిక్షమెత్తితి వేల - బిడియపడక? యడవిలో శబరి ది - య్యని ఫలా లందియ్య జేతులొగ్గితి వేల - సిగ్గుపడక? వేడ్కతో వేవేగ - విదురునింటికి నేగి విందుగొంటి వదేమి - వెలితిపడక? అడుకు లల్పము కుచే - లుడు గడించుక తేర బొక్కసాగితి వేల - లెక్కగొనక? తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను వారి కాశించితివి తిండి - వాడ వగుచు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

73.

సీ. స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి కరుణతో బ్రహ్లాదు - గాచినావు మకరిచే జిక్కి సా - మజము దుఃఖించంగ గృపయుంచి వేగ ర - క్షించినావు శరణంచు నా విభీ - షణుడు నీ చాటున వచ్చినప్పుడె లంక - నిచ్చినావు ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పించిన బహుసంపదల నిచ్చి - పంపినావు తే. వారివలె నన్ను బోషింప - వశముగాదె? యంత వలపక్ష మేల శ్రీ - కాంత! నీకు? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

74.

సీ. వ్యాసు డే కులమందు - వాసిగా జన్మించె? విదురు డే కులమందు - వృద్ధి బొందె? గర్ణు డేకులమందు - ఘనముగా వర్ధిల్లె? నా వసిష్ఠుం డెందు - నవతరించె? నింపుగా వాల్మీకి - యే కులంబున బుట్టె? గుహు డను పుణ్యు డే - కులమువాడు? శ్రీశుకు డెక్కట - జెలగి జన్మించెను? శబరి యేకులమందు - జన్మమొందె? తే. నే కులంబున వీ రింద - ఱెచ్చినారు? నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

75.

సీ. వసుధాస్థలంబున - వర్ణహీనుడు గాని బహుళ దురాచార - పరుడు గాని తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని చదువనేరని మూఢ - జనుడు గాని సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని చూడ సొంపును లేని - శుంఠ గాని అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని మొదటి కే మెఱుగని - మోటు గాని తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి వాని కే వంక లేదయ్య - వచ్చు ముక్తి. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

76.

సీ. ఇభకుంభములమీది - కెగిరెడి సింగంబు ముట్టునే కుఱుచైన - మూషకమును? నవచూతపత్రముల్ - నమలుచున్న పికంబు గొఱుకునే జిల్లేడు - కొనలు నోట? అరవిందమకరంద - మనుభవించెడి తేటి పోవునే పల్లేరు - పూలకడకు? లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క మెసవునే భమత ను - మ్మెత్తకాయ? తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు పరులకీర్తన బాడునే - యరసి చూడ? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

77.

సీ. సర్వేశ! నీపాద - సరసిజద్వయమందు జిత్త ముంపగలేను - జెదరకుండ నీవైన దయయుంచి - నిలిచి యుండెడునట్లు చేరి నన్నిపు డేలు - సేవకుడను వనజలోచన! నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి నీస్వరూపము జూడ - నేర్పు వేగ తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు భక్తిమార్గం బను - పాలు పోసి తే. ప్రేమతో నన్ను బోషించి - పెంచుకొనుము ఘనత కెక్కించు నీదాస - గణములోన. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

78.

సీ. జీమూతవర్ణ! నీ - మోముతో సరిరాక కమలారి యతికళం - కమును బడసె సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక నళినబృందము నీళ్ల - నడుమ జేరె గరిరాజవరద! నీ - గళముతో సరిరాక పెద్దశంఖము బొబ్బ - పెట్ట బొడగె శ్రీపతి! నీదివ్య - రూపుతో సరి రాక పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె తే. నిందిరాదేవి నిన్ను మో - హించి విడక నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

79.

సీ. హరిదాసులను నింద - లాడకుండిన జాలు సకల గ్రంథమ్ములు - చదివినట్లు భిక్ష మియ్యంగ ద - ప్పింపకుండిన జాలు జేముట్టి దానంబు - చేసినట్లు మించి సజ్జనుల వం - చించకుండిన జాలు నింపుగా బహుమాన - మిచ్చినట్లు దేవాగ్రహారముల్ - దీయకుండిన జాలు గనకకంబపు గుళ్లు - గట్టినట్లు తే. ఒకరి వర్శాశనము ముంచ - కున్న జాలు బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

80.

సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగించెద మన్న దేహ మెప్పటికి దా - స్థిరత నొంద దాయుష్య మున్న ప - ర్యంతంబు పటుతయు నొక్కతీరున నుండ - దుర్విలోన బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను మూటిలో మునిగెడి - ముఱికికొంప భ్రాంతితో దీని గా - పాడుద మనుమొన్న గాలమృత్యువుచేత - గోలుపోవు తే. నమ్మరా దయ్య! యిది మాయ - నాటకంబు జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

81.

సీ. వదనంబు నీనామ - భజన గోరుచునుండు జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు హస్తయుగ్మంబు ని - న్నర్చింప గోరును గర్ణముల్ నీ మీది - కథలు గోరు తనువు నీసేవయే - ఘనముగా గోరును నయనముల్ నీదర్శ - నంబు గోరు మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు నాత్మ నీదై యుండు - నరసి చూడ తే. స్వప్నమున నైన నేవేళ - సంతతమును బుద్ధి నీ పాదములయందు - బూనియుండు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

82.

సీ. పద్మాక్ష! మమతచే - బరము నందెద మంచు విఱ్ఱవీగుదుమయ్య - వెఱ్ఱిపట్టి మాస్వతంత్రంబైన - మదము గండ్లకు గప్పి మొగము పట్టదు కామ - మోహమునను బ్రహ్మదేవుండైన - బైడిదేహము గల్గ జేసివేయక మమ్ము - జెఱిచె నతడు తుచ్ఛమైనటువంటి - తో లెమ్ముకలతోడి ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

83.

సీ. గరుడవాహన! దివ్య - కౌస్తుభాలంకార! రవికోటితేజ! సా - రంగవదన! మణిగణాన్విత! హేమ - మకుటాభరణ! చారు మకరకుండల! లస - న్మందహాస! కాంచనాంబర! రత్న - కాంచివిభూషిత! సురవరార్చిత! చంద్ర - సూర్యనయన! కమలనాభ! ముకుంద! - గంగాధరస్తుత! రాక్షసాంతక! నాగ - రాజశయన! తే. పతితపావన! లక్షీశ! - బ్రహ్మజనక! భక్తవత్సల! సర్వేశ! - పరమపురుష! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

84.

సీ. పలుమాఱు దశరూప - ములు దరించితి వేల? యేకరూపము బొంద - వేల నీవు? నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల? రత్నకాంచన మంది - రములు లేవె? పన్నగేంద్రునిమీద - బవ్వళించితి వేల? జలతారుపట్టెమం - చములు లేవె? ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల? గజతురంగాందోళి - కములు లేవె? తే. వనజలోచన! యిటువంటి - వైభవములు సొగసుగా నీకు దోచెనో - సుందరాంగ? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

85.

సీ. తిరుపతి స్థలమందు - దిన్నగా నే నున్న వేంకటేశుడు మేత - వేయలేడొ? పురుషోత్తమమున కే - బోయనజాలు జ గన్నాథు డన్నంబు - గడపలేడొ? శ్రీరంగమునకు నే - జేర బోయిన జాలు స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ? కాంచీపురములోన - గదిసి నే గొలువున్న గరివరదుడు పొట్ట - గడపలేడొ? తే. యెందు బోవక నేను నీ - మందిరమున నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

86.

సీ. తార్క్ష్యవాహన! నీవు - దండిదాత వటంచు గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి యర్థిమార్గమును నే - ననుసరించితినయ్య లావైన బదునాల్గు - లక్ష లైన వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత జూపసాగితి నీకు - సుందరాంగ! యానంద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి వాంఛ దీర్పుము - నీలవర్ణ! వేగ తే. నీకు నావిద్య హర్షంబు - గాక యున్న తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

87.

సీ. అమరేంద్రవినుత! నే - నతిదురాత్ముడ నంచు గలలోన నైనను - గనుల బడవు నీవు ప్రత్యక్షమై - నులువకుండిన మానె దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య! గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖండించి నీస్వరూపము చేసి - నిలుపుకొంచు ధూప దీపము లిచ్చి - తులసితో బూజించి నిత్యనైవేద్యముల్ - నేమముగను తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలుగు నా - కింతె చాలు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

88.

సీ. భువనేశ! గోవింద! - రవికోటిసంకాశ! పక్షివాహన! భక్త - పారిజాత! యంభోజభవ రుద్ర - జంభారిసన్నుత! సామగానవిలోల! - సారసాక్ష! వనధిగంభీర! శ్రీ - వత్సకౌస్తుభవక్ష! శంఖచక్రగదాసి - శార్జ్ఞహస్త! దీనరక్షక! వాసు - దేవ! దైత్యవినాశ! నారదార్చిత! దివ్య - నాగశయన! తే. చారు నవరత్నకుండల - శ్రవణయుగళ! విబుధవందిత పాదబ్జ! - విశ్వరూప! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

89.

సీ. నాగేంద్రశయన! నీ - నామమాధుర్యంబు మూడుకన్నుల సాంబ - మూర్తి కెఱుక పంకజాతాక్ష! నీ - బలపరాక్రమ మెల్ల భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక మధుకైటభారి! నీ - మాయాసమర్థత వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక పరమాత్మ! నీ దగు - పక్షపాతిత్వంబు దశశతాక్షుల పురం - దరుని కెఱుక తే. వీరి కెఱుకగు నీకథల్ - వింత లెల్ల నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె? భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

90.

సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రంచు క్షీరసాగరమందు - జేరినావు నీచుట్టు సేవకుల్ - నిలువకుండుటకునై భయదసర్పముమీద - బండినావు భక్తబృందము వెంట - బడి చరించెద రంచు నెగసి పోయెడిపక్షి - నెక్కినావు దాసులు నీద్వార - మాసింపకుంటకు మంచి యోధుల కావ - లుంచినావు తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను నిన్ను జూతును నాతండ్రి! - నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

91.

సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా బులకాంకురము మెన - బుట్టువాడు నయమైన నీ దివ్య - నామకీర్తనలోన మగ్నుడై దేహంబు - మఱచువాడు ఫాలంబుతో నీదు - పాదయుగ్మమునకు బ్రేమతో దండ మ - ర్పించువాడు హా పుండరీకాక్ష! - హా రామ! హరి! యంచు వేడ్కతో గేకలు - వేయువాడు తే. చిత్తకమలంబునను నిన్ను - జేర్చువాడు నీదులోకంబునం దుండు - నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

92.

సీ. నిగమగోచర! నేను - నీకు మెప్పగునట్లు లెస్సగా బూజింప - లేను సుమ్మి నాకు దోచిన భూష - ణములు పెట్టెద నన్న గౌస్తుభమణి నీకు - గలదు ముందె భక్ష్యభోజ్యముల న - ర్పణము జేసెద నన్న నీవు పెట్టితి సుధ - నిర్జరులకు గలిమికొద్దిగ గాను - కల నొసంగెద నన్న భార్గవీదేవి నీ - భార్య యయ్యె తే. నన్ని గలవాడ వఖిల లో - కాధిపతివి! నీకు సొమ్ములు పెట్ట నే - నెంతవాడ! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

93.

సీ. నవసరోజదళాక్ష! - నన్ను బోషించెడు దాతవు నీ వంచు - ధైర్యపడితి నా మనంబున నిన్ను - నమ్మినందుకు దండ్రి! మేలు నా కొనరింపు - నీలదేహ! భళిభళీ! నీ యంత - ప్రభువు నెక్కడ జూడ బుడమిలో నీ పేరు - పొగడవచ్చు ముందు జేసిన పాప - మును నశింపగ జేసి నిర్వహింపుము నన్ను - నేర్పుతోడ తే. బరమసంతోష మాయె నా - ప్రాణములకు నీఋణము దీర్చుకొన నేర - నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

94.

సీ. ఫణులపుట్టలమీద - బవ్వళించినయట్లు పులుల గుంపున జేర - బోయినట్లు మకరివర్గం బున్న - మడుగు జొచ్చినయట్లు గంగదాపున నిండ్లు - గట్టినట్లు చెదలభూమిని జాప - చేర బఱచినయట్లు ఓటిబిందెల బాల - నునిచినట్లు వెఱ్ఱివానికి బహు - విత్త మిచ్చినయట్లు కమ్మగుడిసె మందు - గాల్చినట్లు తే. స్వామి నీ భక్తవరులు దు - ర్జనులతోడ జెలిమి జేసినయ ట్లైన - జేటు వచ్చు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

95.

సీ. దనుజసంహార! చక్ర - ధర! నీకు దండంబు లిందిరాధిప! నీకు - వందనంబు పతితపావన! నీకు - బహునమస్కారముల్ నీరజాతదళాక్ష! - నీకు శరణు వాసవార్చిత! మేఘ - వర్ణ! నీకు శుభంబు మందరధర! నీకు - మంగళంబు కంబుకంధర! శార్జ్గ - కర! నీకు భద్రంబు దీనరక్షక! నీకు - దిగ్విజయము తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ! నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

96.

సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి సోమకాసురు ద్రుంచి - చోద్యముగను దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల బ్రహ్మ కిచ్చితి వీవు - భళి! యనంగ నా వేదముల నియ్య - నాచారనిష్ఠల ననుభవించుచు నుందు - రవనిసురులు సకలపాపంబులు - సమసిపోవు నటంచు మనుజు లందఱు నీదు - మహిమ దెలిసి తే. యుందు రరవిందనయన! నీ - యునికి దెలియు వారలకు వేగ మోక్షంబు - వచ్చు ననఘ! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

97.

సీ. కూర్మావతారమై - కుధరంబుక్రిందను గోర్కితో నుండవా - కొమరు మిగుల? వరహావతారమై - వనభూములను జొచ్చి శిక్షింపవా హిర - ణ్యాక్షు నపుడు? నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య కశిపుని ద్రుంపవా - కాంతి మీఱ? వామనరూపమై - వసుధలో బలిచక్ర వర్తి నఱంపవా - వైర ముడిగి? తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని తగునె నరసింహ! నీకిది - దగును గాక! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

98.

సీ. లక్ష్మీశ! నీదివ్య - లక్షణగుణముల వినజాల కెప్పుడు - వెఱ్ఱినైతి నా వెఱ్ఱిగుణములు - నయముగా ఖండించి నన్ను రక్షింపు మో - నళిననేత్ర! నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే నమ్మలే దెప్పుడు - నాగశయన! కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె నీపాదకమలముల్ - నిరత మేను తే. నమ్మియున్నాను నీపాద - నళినభక్తి వేగ దయచేసి రక్షింపు - వేదవిద్య! భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

99.

సీ. అమరేంద్రవినుత! ని - న్ననుసరించినవారు ముక్తి బొందిరి వేగ - ముదముతోను నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను నాకు మోక్షం బిమ్ము - నళిననేత్ర! కాచి రక్షించు నన్ - గడతేర్చు వేగమే నీ సేవకుని జేయు - నిశ్చలముగ గాపాడినను నీకు - గైంకర్యపరుడ నై చెలగి నీపనులను - జేయువాడ తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ! నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!

100.

సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్ చెవుల కానందమై - చెలగుచుండు నే మనుజుండైన - నెలమి నీ శతకంబు భక్తితో విన్న స - త్ఫలము గలుగు జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు కమలాక్షుకరుణను - గాంతు రెపుడు నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన దురితజాలంబులు - దొలగిపోవు తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు గషట మెన్నక పఠియింప - గలుగు ముక్తి. భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస! దుష్టసంహార! నరసింహ - దురితదూర!