Lyrics: Annamacharya Singer: Nitya Santhoshini
నెలమూఁడు శోభనాలు నీకు నతనికిఁ దగు
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా IIపల్లవిII
రామనామమతనిది రామవు నీవై తేను
చామన వర్న మతఁడు చామవు నీవు
వామనుఁడందురతని వామనయనవు నీవు
ప్రేమపు(మీ)యిధ్దరికి పేరుబలమొకటే. IIనెలII
హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిఁ గాచెఁ దాను నీవు కరియానవు
సరిఁ దా జలధిశాయి జలధికన్యవు నీవు
బెరసి మీ యిద్దరికిఁ బేరుబలమొక్కటే. IIనెలII
జలజనాభుఁ డతఁడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నలమెఁ దాను
ఇలలో శ్రీ వేంకటేశుఁడిటు నిన్నురాన మోచె
పిలిచి పేరుచెప్పెఁ బేరుబలమొక్కటే. IIనెలII