1. కవి మొదటి వాక్యము
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ.
తా: ఓ మంచి గుణాలు గలవాడా! శ్రీ రామచంద్రుని యొక్క దయ చేత,ప్రజలందరు ఆశ్చర్యపడునట్లు ప్రఖ్యాతమైన ధారళమైన నీతులను,వినువారికి నోరు నుండి నీళ్ళు ఊరునట్టి విదముగా తెలిపెదను.
2. నీచుని గుణము ఎంత మార్చాలని చూసినా మారదు.
ఉత్తము గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలన్ దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ.
తా: అల్ప బుద్ధిగల నీచునికి ఏ విధముగా ఏమి చేసినను మంచి బుద్ధులు రావు, ఇత్తడికి సమానముగా బంగారమును తీసుకొని ఎంత కరిగించి పోసినను అది బంగారమునకు సాటి రాదు.అలాగే నీచుడు కూడా.
3. భర్త విషయములో ఆడదాని స్వభావము తెలుపుతుంది ఈ పద్యము
గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ
గడనుడుగు మగనిఁజూచిన
నడపీనుఁగు వచ్చెననుచ నగుదురు సుమతీ.
తా: సంపాదన కలిగి ఉన్నన్నాళ్ళు మగడికి అడుగులకు మడుగులు ఒత్తి ఆదరించి గౌరవించుతుంది భార్య.అదే ఖర్మకాలి ఆ భర్త సంపాదించలేని వాడాఇనపుడు ఆమె చేసే అపహస్యము అంతా ఇంతా కాదు.
4. దాన గుణము లేనిచో ఏమి జరుగునో తెలుపుతుంది.
పెట్టిన దినముల లోషల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ.
తా: క్రిందటి జన్మమున తాను చేసిన దానము నట్టడివి మధ్యనున్నప్పటికినీ అక్కడ వారికి సకల పదార్ధములు కలుగును. పూర్వజన్మమున దాన మీయకున్నచో తాను బంగారముకొండ నెక్కినను ఏమి ప్రయోజనము ఉండదు.
5. యోగ్యుని గురించి తెలుపుతుంది ఈ పద్యము.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ.
తా: ఎంతమంది చెప్పినను శాంతముతో వాటిని వినవలెను.విన్న తరువాత తొందర పడక వాటిలోని నిజనిజాలను తరచి ఆలోచించి అర్థం చేసుకోవాలి.ఆ విధముగా చేసినవాడే నిజమైన బుద్ధిమంతుడుగా భూమియందు ఎంచబడతాడు.
6. బలవంతుడినని అహంకారపడితే...!
బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ.
తా: బలవంతుడైన వ్యక్తి తాను బలవంతుడినను అహంకారపడితే పాము ఎంత బలం కలిగిఉన్నప్పటికినీ చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే వాడి పరిస్థితి కూడా అగును.కాబట్టి బలంతో అందరితో వైరము తెచ్చుకొనుట బుద్ధితక్కువ.అది మేలు కాదు.
7. నీతి మార్గము భోదిస్తుంది.
పతికడకు,తన్నుఁగూర్చిన
సతికడకును,వేల్పుఁకడకు, సద్గురు కడకున్,
సుతుకడకు, రిత్తచేతుల
మతిమంతులు చనరు,నీతి మార్గము సుమతీ.
తా: న్యాయమైన బుద్ధి గలవారు,యజమాని దగ్గరకును,అధికంగా ప్రమించే తన భార్య యొద్దకును, మనలను రక్షించు భగవంతుని దగ్గరకు,విద్యను బోధించు గురువు కడకును, పుత్రుని దగ్గరకును వట్టిచేతులతో వెళ్ళరు,ఇది అందరు పాటించవలసిన నీతి,(రాజ)మార్గము.
8. లోభత్వముతో కూడబెట్టిన ధనము ఎలా నేలపాలగునో వివరించారు.
తాననుభవింప నర్ధము
మానవపతిజేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరుజేరునట్లు తిరముగ సుమతీ.
తా: లోభత్వముతో కుడబెట్టిన ధనము ఏ విదముగానయితే తేనెటీగలు అరణ్యములలో చేర్చియుంచిన తేనె యితరులకు చేరునో, అలాగే కొంత రాజులపాలు, మరికొంత నేలపాలూ యగును.(లోభులు ఈ విషయమునందు తమ ప్రవర్తనను మార్చుకోవలెనని దీని అర్ధము)
9. పిసినారితనం గలవారి సంపద చివరికి ఏమవుతుందో తెలుపుతుంది ఈ పద్యము.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ.
తా: పాములు చీమలు ఏంతో కష్టపడి నిర్మించుకున్న పుట్టలను ఏ విధముగానయితే ఆక్రమించుకుని నివాస స్థానముగా మార్చుకుంటాయో, తన పొట్ట తానే కొట్టుకుని పిసినారి దాచిపెట్టుకున్న ధనము అదేవిధముగానే రాజుల ఖజానాలోకి వెళ్ళి తీరుతుంది.
10. తనకు అందుబాటులో ఉన్న గొప్పవాటిని గుర్తించలేని మనిషి స్వభావము తెలుపుతుంది
తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపుఁ, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ.
తా: మనిషి తను ఉండే చోటు యొక్క మహత్మ్యమును,తపోనిష్టను,తన కుటుంబము లోని కుమారుని యొక్క అభివృద్ధిని, విజ్ఞానమును, ఇంటనున్న భార్య అందమును, ఇంటి గుమ్మమందు ఉన్న చెట్టు యొక్క ఔషధ గుణములను గుర్తించలేడు,గొప్పవిగా భావింపలేడు.
11. వ్యర్ధమయిన వాటిని ఈ పద్యమునందు తెలుసుకోవచ్చును.
కవి గానివాని వ్రాతము
నవరసభావమును లేని నాతులవలపున్
దవిలి చని పంది నేయని
వివిధాయుధకౌశలంబు వృథరా సుమతీ.
తా: వ్యర్ధములగు వస్తువులు ఏమిటో ఈ భావమునందు తెలుసుకుందాము.కవికాని వాడు చేయు రచనలు,వివిధ భావములను పలికించలేని స్త్రీ యొక్క ప్రేమ, వెంటాడి వేటాడి వివిధాయుధాల నైపుణ్యముచే అడవిపందిని కొట్టలేని పురుషులు వారి యొక్క విద్యా కౌశలము ఎందుకు పనికిరావు.
12. వేని వద్దకు పోవుట వలన అపాయము కలుగునో తెలుపుతుంది.
ఉదకముఁ ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ.
తా: దాహముతో మంచినీటిని త్రాగే గుఱ్ఱము దగ్గిరకు, క్రొవ్వెక్కి మదముతో బలిసి వున్న ఏనుగు దగ్గిరకు,ఆవు దగ్గిరకు వచ్చిన ఆంబోతు దగ్గిరకు, విద్యా బుద్ధులు లేనటువంటి హీనుని వద్దకు పోకూడదు.అటువంటి వారి వద్దకు పోయిన లేనిపోని ఆపద చుట్టుకొనును.
13. గొల్లకులములో పుట్టినంత మాత్రాన అజ్ఞాని కాడు.
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్ల నివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనెగుణమున సుమతీ.
తా: తనంటే ఇష్టపడని భార్యను, తనయందు నమ్మకమును నిలుపుకోని రాజును, అయిష్టతను చూపే స్నేహితుడిని వదిలివేయుటకు మనసు ఒప్పుకొననివాడు అజ్ఞాని(గొల్లవాడు)అగును.అంతేకాని గొల్లకులములో పుట్టినంత మాత్రాన అజ్ఞాని కాడు.
14. నమ్మకూడనటువంటివి ఏమిటో ఈ పద్యమునందు వివరించారు.
కోమలి విశ్వాసంబునఁ
బాములతోఁజెలిమిఁయన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ.
తా: లోకములో అన్నింటియందు నమ్మకమును ఉంచకూడదు అను అర్థమునకు ఈ క్రింది వాటినే తార్కాణముగా తీసుకోవచ్చును. ఆడదాని యొక్క నమ్మకమును, పాములతో స్నేహమును, పరస్త్రీల యొక్క ప్రేమయందు,వేప చెట్టు యొక్క తియ్యదనమునందు, రాజులయొక్క విశ్వాసమును నిజము కాదు.
15. ఉత్తమ పురుషుని గుణము గురించి తెలుపుట
పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక, పరులకు హితుఁడై
పరులుఁ దనుఁబొగడ నెగడకఁ,
బరు లలిగిన నలుగనతఁడు, పరముఁడు సుమతీ.
తా: ఉత్తముడైన మనుషుడు పరస్త్రీలకు తోడబుట్టినవాడై, పరుల ధనముల యందు ఆశనుంచకుండా, ఇతరులకు మిత్రుడై, తనను పొగిడినచో ఉబ్బి తబ్బిబ్బయిపోక, ఇతరులు అలిగిననూ తాను అలకవహించనివాడు అవుతాడు.
16. కూడనటువంటివి తెలుపుతుంది.
రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ.
తా: నిర్ధారణ చేసి మాట్లాడిన తరువాత అసత్యమాడకుము.అండగానుండు బంధువులకు అపకారము చేయకుము.కోపగించు ప్రభువుకు సేవ చేయకుము.పాపాత్ములు సంచరించు ప్రదేశానికి వెళ్ళకుము.(ఇవి కీడే కలిగించును)
17. వ్యర్ధములైనటువంటివి తెలుపుతుంది.
వరిపంటలేని యూరును,
దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గ్రహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ.
తా: వరిపంటలేని ప్రదేశము, అధికారియుండని గ్రామమును,సహవాసం దొరకని మార్గమును, యజమానుఁడులేని గృహము వల్లకాడుతో సమానము.
18. అభిమానవంతుని గురించి వివురించుతుంది.
మానధను డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ.
తా: ఏనుగు తన శరీరమును చలీ చాలని నీటిలో దాచుకొనునా?అదేవిధంగా ఆత్మాభిమానం గలిగిన ఉత్తమ పురుషుడు హృదయమునందలి ధీరత్వమును విడిచిపెట్టి నీచుడిని ఎంత మాత్రము సేవించడు.
19. ఆశపడని వాటిని గురించి తెలుపుతుంది ఈ పద్యము.
పరసతి కూటమిఁ గోరకు,
పరధనముల కాసపడకు,పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ.
తా: ఎవరైన సరే పరభార్యల పొందును ఆశించకుము.ఇతరుల ధనమునకు ఆశపడకు, సరిగాని మాటలు ఆడవలదు.ధనము పోయి చుట్టముల వద్దకు చేరకు.
20. మనిషి స్వభావము తెలుపుతుంది ఈ పద్యము.
తన కలిమి యింద్రభోగము,
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ర్పళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ.
తా: మానవుడు తనకు కలిగినటువంటి సంపద ఇంద్రునికి ఉన్నంతటి ఐశ్వర్యముతో సమానమని,తనకు కలిగిన పేదరికము ప్రపంచమున ఉన్నటువంటి గొప్ప బీదరికము వంటిదని, తన చావే ప్రపంచమునకు గొప్ప ప్రళయముగాను, తాను ఇష్టపడిన స్త్రీ రంభ అంతటి సౌందర్యవతియని భావించుటము జరుగును.
21. కరణమును నమ్ముకుంటే కష్టములు తప్పదు అని తెలుపుతుంది.
కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ.
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ.
తా: బండి ఎవరిదైననూ యిరుసులో కందెనను బెట్టనిదే పరుగెత్తదు. చివరికి అది ఆ పరమేశ్వరుని బండి అయినను, అట్లే భూస్వాములు కరణమును అనుసరించి బ్రతుకకున్న యెడల కష్టములు సంభవించును.
22. యదార్థములైన వాటిని మనుషులు తెలుసుకోవాలని తెలుపుతుంది.
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియము సుమతీ.
తా: అల్లుఁడు మంచి గుణముతో గొప్పవాడుగా నుండుట, గొల్లవాడు భాషా జ్ఞానము గలవాడుగా అగుట, ఆడది ఎప్పుడూ నిజము చెప్పుట, ఊకను దంపగా వచ్చిన బియ్యము, తెల్లని రంగు కలిగిన కాకులును ప్రపంచమునందు ఉండవని గ్రహించి మానవులు మెలగవలయును.
23. పసి బాలికలను అనుభవించు మనుజుడు పశువుతో సమానమగును.
కసుగాయఁ గఱచి చూచిన
మసలకఁతగు యొగరుఁగాక మధురంబగునా?
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలఁబొందువాడు పశువుర సుమతీ.
తా: ఆడవారి విషయములో వయసు తారతమ్యమును ఎంచకుండా ప్రవర్తించే మగవారిని ఈ క్రింది విధముగా పోల్చుచున్నారు ఈ భావమునందు.పక్వమునకు వచ్చిన పండ్లు ఉండగ పక్వమునకురాని పండ్లను కొఱికి చూచిన అవి తియ్యగా ఉంటాయా? అలాగే లోకంలో వయసుకు వచ్చిన ఆడవారు ఉండగా పసి బాలికలను అనుభవించు మనుజుడు పశువుతో సమానమగును.
24. వేశ్యల యొక్క స్వభావము వివరించుతున్నారు.
తలపొడుగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలఁదడివి బాసఁజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ.
తా: వ్వభిచారిణి నిలువెత్తు ధనము ధారపోసినను నిజము చెప్పలేదు. వేశ్య తలమీద చేయి వేసుకొని ప్రమాణము చేసినను ఆమె మాటలు నమ్మరాదు.(ఇరువురు అబద్ధమును ఆశ్రయించి జీవించేవారే)
25. తగనివాటి కష్టము తెలుపుతుంది.
పా టెరుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని గోమలి రతియున్,
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.
తా: క్రూరుడై తను చేసే పని యందలి కష్టసుఖములు(సుఖ దుఃఖములు) తెలుసుకోలేని అధికారి వద్ద కొలువు, కూటమి తెలియనటువంటి స్త్రీ యొక్క పొందు, అపాయము తప్పదనుకొను స్నేహమును లోతుగా ఆలోచిస్తే నదికి ఎదురీగినంత కష్టము.
26. ఎట్టి పరిస్థితులలోనూ కూడనటువంటి పనులు చెపుతుంది.
వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనులకడ కేగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ.
తా: వరద వచ్చినపుడు పొలమును దున్నకు, కరవు కాలమునందు కోరి బంధువుల కడకు చేరకు, ఇతరులకు రహస్యములను తెలుపకు, పిరికివాడికి సేనాధిపత్యము కట్టబెట్టకు.
27. ఉత్తమ స్త్రీ యొక్క గుణములు తెలుపుతుంది.
పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడలఁదల్లియు,
యనదగు కులకాంత యుండనగురా సుమతీ.
తా: సద్గుణవతియైన ఉత్తమ ఇల్లాలు -ఇంటి పనులు చేయునపుడు సేవకురాలుగను, సంభోగించునపుడు రంభవలెను, సలహాలు చెప్పునపుడు మంత్రివలెను, తినువేళలో తల్లివలెను ఉండవలయును.
28. దుర్మార్గుడి స్వభావము వివరించుతున్నారు.
తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్
దల దోఁక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ.
తా: దుర్మార్గుడైన మనిషికి నిలువెల్లా విషమే ఉంటుంది.ఇటువంటి వాడికంటే తల యందు విషముండు పాము, తోకయందు విషముండు తేలు నయము. అందుచేత దుష్టుడి జోలికి పోరాదు.
29. మనిషికి కొన్ని చేరిన తరువాత వదిలించుకుందామన్న విడువవు.
కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదు సుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
తా: దుష్టబుద్ధి గలవారితో స్నేహము చేయనే కూడదు.కీర్తి ఒకసారి తన దయిన తరువాత వద్దన్నా మదలిపోదు.ఋణము ఇవ్వటమంటే శత్రుత్వమును కోరి కొనుక్కోవటమే అవుతుంది. స్త్రీల ప్రేమ కొంచెమయిననూ వుండదు.
30. దుర్మార్గులతో స్నేహము కూడదు.
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను జెఱకు కైవడినే పో
నెపములు వెదకునుఁ గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ.
తా: చెడ్డవానితో స్నేహము చెరుకుగడ మొదట కొంచెం తీయగా వుండి మధ్య మధ్యలో కణుపుల వద్ద తీపి హరించి చివరికి వచ్చినపుడు ఏ విధముగానయితే చప్పగా అయిపోవునో అదే విధముగా అవుతుంది. కాబట్టి దుర్మార్గునితో స్నేహము మొదలు ఇంపుగా వున్నదని భావింపక జాగ్రత్తగా ఉండవలెను.
31. అధికారి అసమర్ధుడు అయినప్పుడు...!
అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీ.
తా: పెదవి కదలకుండగనే మంచి మాటలను వదలి, అధికారముచే మౌనవ్రతమును పట్టిన నియమముగా గల్గినటువంటి అధికారి- చెవులు వున్నను వినిపించని వానివలె, కండ్లు ఉన్నను కనిపించని వానివలె, పెదవి కదల్చక జీవము లేనటువంటి శరీరము సమానమే యగుటచేత, అటువంటి అధికారి దర్శన మాత్రము చేతనే అనేక పాపములు చుట్టుకొనును.
32.అనుక్షణం తప్పులు వెదకు యజమానిని సేవించుట తగదు.
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ నది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ.
తా: ఎల్లవేళలా తప్పులు కనిపెట్టునట్టి మనుష్యుని వద్ద పనిచేయకూడదు. ఎందుచేత ననగా, కప్ప తనను మ్రింగివేయుటకు సిద్ధముగాన్ను పాము యొక్క పడగ క్రింద జేవించిన ఎంత అపాయమో ఆ సేవకుని స్థీతికూడా అంతే అపాయము.
33.వివాహం చేసుకున్న స్త్రీని బాధించుట వలన కలిగే అపకారము తెలుపుతుంది ఈ పద్యము.
కులకాంతతోడ నెప్పుడుఁ
గలహింపకుఁ వట్టి తప్పు ఫుటియింపకుమీ
కలకంఠి కంటి కన్నీ
రొలిగిన సిరి యింటనుండ దొల్ల దు సుమతీ.
తా: ఎటువంటివి చేయరాదో దాని వలన ఎటువంటి దోషాలు కలుగుతాయో వివరణ ఇచ్చారు.వివాహము చేసుకున్న భార్యతో ఎప్పుడు తగువులాడవద్దు. లేని తప్పును ఉందని మోపరాదు. ఉత్తమ స్త్రీని భాధించరాదు.ఆమె బాధతో కన్నీరు కార్చిన ఆ కన్నీటి బొట్టు దరిద్రమునకు కారణమగును.లక్ష్మి ఇంట నుండుటకు అయిష్టపడుతుంది.
34.బుద్ధిమంతులకు ఉపకారము చేసిన తిరిగి మేలు జరుగుతుంది.
ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ.
తా: కొబ్బరిచెట్టుకు నీరు పోసినచో ఉత్తమములైన నీరుగల కాయలను యిచ్చును. ఆ విధంగానే బుద్ధిమంతులకు జేసిన ఉపకారము మర్యాదయును తరువాత మిక్కిలి సుఖములను గల్గించును.
35.స్నేహము, శత్రుత్వముల ప్రభావము ఈ పద్యము నందు తెలుసుకోవచ్చును.
కూరిమిగల దినములలో
నేరములెన్నఁడునుఁ గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
తా: స్నేహముగా ఉన్న సమయాలలో ఎదుటి వ్యక్తి ఏమి చేసినా అందులో ఏ దోషాలు కనపడవు.పొరపాటున ఏదన్నా విషయములో గొడవ ఏర్పడి శత్రుత్వము కలిగినప్పుడు ఎదుటి వ్వక్తి చేసే ప్రతి పనిలో తప్పులే కనపబడును.ఒక విధముగా మనుషులు ఆ సమయములో తప్పులు వెతుకుటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
36.మంచి గుణములను అనుసరించవలెను.
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనులఁ, దోషము సుమ్మీ!
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువులాజ్ఞ, మేదిని సుమతీ.
తా: పండకుండా దోరగా ఉన్నటువంటి కాయలను కోయరాదు.చుట్టములతో పరుషముగా వ్యవహరించి వారిని నిందింపకూడదు.పోరునందు పిరికివానివలె వెన్నుచూపి పారిపోరాదు.గురువుల ఆజ్ఞను దైవాజ్ఞగా భావించి వారు చెప్పిన విధముగా ప్రవర్తించుము.వారి ఆజ్ఞను మీరవలదు.
37.మానవులు అనుసరించివలసిన నియమములు.
ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ.
తా: ఇతరులకు చెప్పగలిగినటువంటిదియే విద్య, యుద్ధభూమిలో ప్రవేశించునట్టిదియే ధీరత్వము, ఉత్తమ కవులు గూడా పొగిడి మెచ్చుకొనువంటిదియే నేర్పరితనము. తగువులు వచ్చు పని చేయుటయే అపాయముతో కూడిన కీడు కలిగించును సుమా.
38.వ్యర్థమైన పుత్రుడి వలన కలిగే ఆపకీర్తి తెలుపుతుంది ఈ పద్యము.
కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియెగాదు తండ్రి గుణములఁజెఱచున్
జెఱకుతుద వెన్ను పుట్టినఁ
జెఱకునఁ తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ.
తా: చెఱకు చివర యందు వెన్ను పుట్టి ఆచెఱకు నందు ఉన్న తీపినంతటిని ఏ విధముగా పాడుచేయునో ఆ విధముగానే పనికిరాని కొడుకు పుట్టినచో వాడు పనికిరాని వాడిగా తయారవటమే కాకుండా తండ్రి సంపాదించుకున్న మంచి పేరును నాశనము చేస్తాడు.
39.కరణము మరియొక కరణమును నమ్మకూడదని తెలుపుతుంది.
కరణముఁగరణము నమ్మిన
మరణాంతక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ.
తా: కరణము మరియొక కరణమును నమ్మినచో ఇక జీవించుట కల్ల అగును. అనగా ప్రాణములు పోవచ్చును. కావున తనకు సమానమైన కరణమును మరియొక కరణము గ్రుడ్డిగా విశ్వసించక అతనికి తన రహస్యమును తెలుపకుండా జీవించవలయును.
40.అక్కరకు అవసరము రానివి పరమ అసహ్యకరములుగా ఎంచబడుచున్నవి.
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోఁత మేదిని సుమతీ.
తా: ఆకలితో అలమటించునపుడు ఆ అకలిని తీర్చలేని భోజనము, ధనముకు అమ్ముడుపోవు పడుపుతో చేయు వ్యవహారము, చాలా దినముల నుండి నిలువ వుండుట వలన పాచిపట్టిన బావి యందలి నీరు, మేకల పాడియును పరమ అసహ్యకరము.
41.హాస్యములాడదగనివారు ఎవరో ఈ పద్యము తెలుపుతుంది.
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్,
నవ్వకుమీ పరసతులతొ,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ.
తా: ప్రభువులు నిర్వహించు సభలయందు, కన్నవారి తోడను, ప్రజాపాలకుల తోడను, తన స్త్రీ కానిదానితో, బ్రాహ్మణోత్తముల తోడను హాస్యములాడకుము(ఇది మంచిది కాదు.)
42.బలవంతుడు ఎవరో చెపుతుంది.
లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁ డెక్కినట్లు మహిలో సుమతీ.
తా: శరీర ధారుడ్యము గలవాడు బలవంతుడు కాడు. నీతి న్యాయములు ఊపిరిగా కలవాడే బలవంతుడు.ఉదాహరణకు తీసుకుంటే పర్వతమంతటి ఆకారమువున్న ఏనుఁగు మావాటివాడికి అలుసే కదా.(మావాటివాడు దాని మీద ఎక్కి దానిని లోబరచు కొనును)
43.దుష్టుని బుద్ధిని గురించి తెలుపుతుంది ఈ పద్యము.(భర్తృహరి శ్లోకమును కనుకరణము)
పాలసునకైన యాపద
జాలింబడి తీర్చతగదు సర్వజ్ఞునకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.
తా: సర్వం గ్రహించిన వాడయినను, నిప్పులో పడినదని బాధపడి తేలును రక్షించబోతే అది కుట్టును. దాని స్వభావము అంతే. అదేవిధంగా దుష్టునికి అపాయము కలిగినపుడు అయ్యో! అని చింతించి కాపాడితే వాడు తిరిగి మనకే హాని చేయుటకు పూనుకుంటాడు.
44.ఆభరణముల వంటి వాటిని తెలుపుతుంది.
నీరే ప్రాణాధారము ,
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్,
నారే నరులకు రత్నము
చీరే శృంగారమండ్రు, సిద్ధము సుమతీ.
తా: జలమే భూమియందలి అన్ని జీవుల ప్రాణములు నిలబడుటకు ఆధారము. నోరే మంచి మాటలు పలుకుటకు ప్రధానము. ఆడువారే సర్వ జనులకు రత్నము. వస్ర్తమే శృంగారమునకు ముఖ్యము.
45.ధనము యొక్క మహిమను ఈ పద్యమునందు తెలుసుకోవచ్చును.
చుట్టములు గానివారలు
చుట్టములముఁ నీకటంచు సోంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ.
తా: హఠాత్తుగా ధనము కలిగినపుడు బంధువులతో పాటుగా బంధువులు కానివారు కూడా మీకు స్నేహితులము, బంధువులము అని బలవంతముగా వచ్చి ఆశ్రయమునందు ఉందురు.
46.అవసరమునకు పలుకని నోరు ఎందుకు పనికిరాదు.
ఇమ్ముగఁజదువని నోరును
'అమ్మా'యని పిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ములఁమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.
తా: అస్పష్టంగా పలికే నోరు, అన్నము కావాలని ఆకలి వేసినపుడు తల్లిని 'అమ్మా'యని పిలిచి అడుగని నోరును, ఎప్పుడూ తాంబూలము వేసుకొనని నోరును, కుమ్మరిపనివాడు కుండలు చేయుటకు మన్నుకోసం త్రవ్విన గుంటతో సమానము అవుతుంది సుమా!
47.బాధించునటువంటి కొన్ని దుఃఖములు
కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ.
తా: కప్పకు కాలి విరిగి అటు ఇటు గెంతలేక పోయినచో, పాముకు దీర్ఘ వ్యాధి కలిగిన దుఃఖించును. భార్య కఠినాత్మురాలైన భర్తకు దుఃఖము కలుగును.వృద్ధాప్యమునందు దరిద్రము వచ్చినపుడు అంతకంటే దుఃఖము మరొకటి ఉండదు.
48.నివాసమునకు అనుకూలముగా ఉండునవి.
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
తా: అవసరమునకు ద్రవ్వమును ఇచ్చువాడు,వైద్యుడు, ఎల్లవేళలా నీటితో సమృద్ధిగా వుండి ప్రవహించునట్టి నదియును,ఉత్తమ శుభ కార్యములు నిర్వహించునట్టి బ్రాహ్మణుఁడును కలిగిన ఊరిలోనే నివసింపుము. ఇవి లభించని చోట కాలును కూడా మోపకుము.
49.పొందకూడనటువంటి వాటిని తెలుపుతుంది ఈ పద్యము.
పరుల కనిష్ఠము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్
బరుఁగలిగిన సతి గవయకు
మెరిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ.
తా: ఇతరులకు యిష్టముగాని దానిని గురించి ప్రస్తావించబోకుము, ఊరికే ఇతరుల ఇండ్లకెన్నడునూ వెళ్లకుము, ఇతరులు పొందిన స్త్రీని పొందకుము, పెంకితనము గలిగిన అశ్వమును నెక్కకుము.
50.చేరకూడని కొలువు గురించి వర్ణిస్తుంది.
'రా, పొ' మ్మని పిలువని యా
భూపాలునిఁగొల్వ భుక్తిముక్తులు గలవే?
దీపంబులేని యింటనుఁ
జే పుణికి ళ్ళాడినట్లు సిద్ధము సుమతీ.
తా: రమ్మని పొమ్మని అనని రాజును సేవించటం ఎంత నిష్ప్రయోజన మంటే దీపములేని ఇంటిలో దీపము లేదని తెలిసి కూడా చేతులతో తడుము లాడినట్లు అవుతుంది.
51.విలువ కట్టలేనటువంటి వాటిని తెలుపుతుంది.
పలుదోమి సేయు విడియము
తలఁగడిననాటి నిద్ర, తరుణుల తోడన్
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ.
తా: దంతములు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలమును,తలంబుకొని స్నానముచేసిన నాటి నిద్రయును,స్త్రీలతో ప్రణయకలహమునాడు కూడిన పొందును-వీటి విలువ యింతని చెప్పలేము సుమా.
52.త్యజించవలసినటువంటివారిని తెలుపుతుంది ఈ పద్యము.
పరునాత్మఁ దలచుసతి విడు,
మరుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగనిఁ భటు నేలకు
తఱుచుగ సతిఁ గవయబోకు, తగదుర సుమతీ.
తా: వివాహమాడిన స్త్రీ హృదయమునందు వేరే మగవాడిని కోరినంతనే ఉత్తమ భర్త అటువంటి స్త్రీని వదిలివేయటమే మంచిది.అదేవిధముగా ఎదురుమాట్లాడు కుమారుని క్షమించి విడువ కూడదు. భయపడని సేవకుని యుంచుకొనరాదు. అదే పనిగా భార్య యొక్క పొందు పొందరాదు.
53.చేరదీయనటువంటివి తెలుపుతుంది ఈ పద్యము.
మేలెంచని మాలిన్యుని,
మాలను, నగసాలెవాని, మంగలిహితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడదు సుమతీ.
తా: రాజులు కొందరిని చేరదీయకూడదు వారిలో మంచిని కోరుకోని చెడ్డమనసు గలవాడు, మాలవాడు,కంసాలి,మంగలి ముఖ్యులు. ఇటువంటి తక్కువ వారికి చనువిచ్చి స్నేహము చేసినచో అటువంటి రాజు యొక్క పరిపాలన, రాజ్యము నాశనమైపోతాయి.
54.ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట తెలుపును.
ఓడలుఁ బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీదఁ నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ.
తా: సాధారణముగా ఓడలమీద బండ్లు, బండ్లమీద ఓడలు వచ్చును. అలాగే భూమి నందలి మనుషులకు సంపద వెంట దారిద్ర్యము,దారిద్ర్యము వెంట సంపద వచ్చును.ఈ కారణముతోనే జనుల యొక్క అదృష్టము కూడా మారుతుంది.
55.ప్రాణములైనటువంటివాటి గురించి వివరిస్తుంది.
మాటకుఁ బ్రాణము సత్యము,
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము,
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.
తా: మాట్లాడే ప్రతీ మాటకు నిజమును, రాజు కోటకు మంచి భటుల సముదాయము, స్త్రీకి శీలమును,లేఖకు సంతకము అత్యంత ప్రాణప్రదములై అలరారుతున్నవి.
56.కరుణ చూపని వాటిని పట్టుకు వ్రేళ్ళాడకూడదని తెలుపుతుంది.
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ.
తా: సమయానికి ఉపయోగంలోనికి రానటువంటి చుట్టము, దండ ప్రణామముల చేత ప్రార్థించినను వరమునీయని దైవము, రణమునందు తాను ఎక్కినను ముందుకు సాగని గుఱ్ఱమును తక్షణమే విడిచివేయవలెను.
57.ఎవరు ఉండవలసిన ప్రదేశాల్లో వారు ఉండటమే ఉత్తమము.
కమలములు నీట బాసినఁ
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా: అందమైన తామరలు తమ సొంత నివాసమైన సరస్సు నీటిని వదలినచో తమకు ఆప్తుడయిన సూర్యుని వేఁడి కిరణాలు తాకినంతనే వాడిపోవును.అలాగే ఎవరైనా సరే తాము నివసించు ప్రదేశాన్ని వదిలి దూరముగా వేరే ప్రదేశానికి వెళ్ళెదరో అపుడు తమకు అత్యంత ఆప్తులు అనుకున్న స్నేహితులే శత్రువులుగా మారుతారు.ఇది సత్యము.
58.చేయకూడనటువంటివి తెలుపుతుంది.
అడియాస కొలువుఁ గొలువకు,
గుడిమణియముఁ సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ.
తా: అశలేనటువంటి ఉద్యోగ నిర్వహణలోను, దేవాలయ అధికారమును, చెడు గుణములు కలవారితో మిత్రత్వము, అడవిలో ఎవరి తోడు లేకుండా ఒంటరిగా ఒక్కడివే వెళ్ళుట మంచిది కాదు. ఇటువంటి వాటిని మానివేయ వలయును.
59.స్వభావమునకు విరుద్ధముగా ప్రవర్తించేవారి గతి...!
కరణము సాదై యున్ననుఁ
గరిమదముడిగిననుఁ, బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్ననుఁ
గరమరుదుగ లెక్కగొనరుగదరా సుమతీ.
తా: లోకములో ఎవరు తమ స్వభావానికి విరుద్ధముగా ప్రవర్తించెదరో వారు ఎటువంటి కష్టములను, అవమానములను పొందుతారో ఈ భావము తెలుపుతుంది.అన్నివేళలా మెతకతనముతో ఉండేవారిని ఈ క్రింది వాటి విధముగా ఎవ్వరు లక్ష్యపెట్టరు. అణుకువ కలిగి మెతక స్వభావం గలిగి యుండినను, ఏనుగు తన మద స్వభావమును వదిలిపెట్టినను, పాము కఱవ కుండ విడిచిపెట్టినను,తేలుకుట్టకుండా ఉండినను జనులు వాటిని లెక్కచేయరు.
60.నమ్మకం ఉంచకూడనటువంటి వారు ఎవరో తెలుపుతుంది.
నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలివాని, నటువెలయాలిన్,
నమ్మకు మంగడివానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ.
తా: పన్నులు వసూలు చేయువానిని, జూదమాడువానిని, కంసాలిని, వేశ్యాస్త్రీని, సరుకులమ్మువారిని, ఎడమచేతితో పనిచేయువారి యందు విశ్వాసము ఉంచటం వ్యర్థము.
61.ప్రాణము వంటి వాటిని తెలుపుతున్నారు
పురికిని బ్రాణము కోమటి,
వరికినిఁ బ్రాణంబు నీరు, వసుమతిలోనన్
కరికిని ప్రాణము తొండము
సిరికినిఁ బ్రాణంబు మగువ, సిద్ధము సుమతీ.
తా: వర్తకుడు(కోమటివాడు)నగరమునకు ప్రాణము వంటివాడు అతడు లేకున్నచో వస్తువులు తెచ్చి అందించువారు లేక ప్రజలు అవస్థల పాలగుదురు. వరిపైరునకు నీరును, ఏనుగునకు తొండమును, సంపదలకు స్త్రీయును ప్రాణము వంటివి.
62.సమర్ధత ప్రాముఖ్యతను వివరించుతుంది.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ.
తా: సమర్థత లేని మంత్రి ఉండుట రాజ్యమునకు వ్యర్ధమే అవుతుంది.ఎలాగంటే కొండంత ఏనుఁగునకు తొండములేనట్లు.
63.స్త్రీ స్వభావమును వివరించుతుంది.
మది నొకని వలచియుండగ,
మదిచెడి యొక కౄరతిరుగన్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.
తా: ఉత్తమ స్త్రీ మనసునందు ఎవరినైనా ప్రాణాతి ప్రాణముగా ప్రేమించినచో పరాయి పురుషుడు తనను ఎంతగా ఆకర్షించుటకు ప్రయత్నించినను వారిని ఇష్టపడదు. ఏవిధముగానయితే పంజరములో పెట్టిన చిలుక పెంచిన వారితో మాట్లాడునే గాని పిల్లివచ్చి పట్టుకొని మాట్లాడు అంటే మాట్లాడునా? ఇది లోకధర్మము కూడా.
64.చెడ్డవారితో స్నేహము వద్దంటుంది ఈ పద్యము.
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవిఁజెరుచు గావున,
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ.
తా: నీరు పాలతో కలసిపోయినపుడు పాలవలె కనిపిస్తుంది.కాని నిజానికి ఆ నీరు పాలలో కలియుట వలన పాల యొక్క రుచి తగ్గిపోతుంది.అలాగే ఉత్తముడు దుష్టబుద్ధి గలవానితో సన్నిహితంగా స్నేహం చేసినపుడు, ఉత్తమ గుణములతో దుష్టగుణాలు గూడి వాటిని నాశనము చేయును.కావునా దుష్టులకు దూరంగా ఉండుట మేలు.
65.తగని కార్యములు తెలుపుతుంది.
పిలువని పనులకు బోవుట.
గలయని సతి రతియు, రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును,
వలవని చెలిమియును జేయ వలదుర సుమతీ.
తా: పిలువని పేరంటంబునకు వెళ్ళిన విధముగా ఆహ్వనించని చోట్లకు పనుల నిమిత్తము పోవుట, అయిష్టపడిన స్త్రీ పొందు చేరుట, రాజు చూడని పనికి, ప్రేమించని స్నేహమును చేయరాదు.
66.వేశ్యా స్వభావము తెలుపుతున్నారు.
పులిపాలు దెచ్చి ఇచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ.
తా: వేశ్యా స్త్రీ స్వభావము ఎటువంటిదనగా పులిపాలు తెచ్చినను, గుండె కాయను కోసి అఱచేతిలో బెట్టినను, నిలువెత్తు ధనము ధార పోసినప్పటికినీ దాని మనసులో ఇసుమంత ప్రేమా అభిమానము కూడా కలుగదు.
67.బ్రతుకు తెరువు వుండనటువంటి కొన్ని విషయాలు.
పొరుగునఁ పగవాడుండిన
నిరవొంఁదగ వ్రాతకాడె యేలికయైనన్
ధరగాఁపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ.
తా: మిక్కిలి శత్రువు అయినటువంటివాడు ఇంటి సమీపమునే నివాస మున్ననూ, నైపుణ్యత కూడిన వ్రాత కలవాఁడు ప్రభువైననూ, రైతు చాడీలు చెప్పెడివాఁడైననూ కరణములకు బ్రతుకు తెరువుండదు.
68.వ్యర్థమైనవాటి గురించి తెలుపుతుంది ఈ పద్యము.
కారణము లేని నగవునుఁ
బేరణము లేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణము లేని బూరెయు
వీరణములు లేని పెండ్లి వృథరా సుమతీ.
తా: వ్యర్థమైన వాటిని గురించి తెలుపుతున్నారు. కారణములేకుండా నవ్వే స్త్రీ,రవికెలేని స్త్రీయును,పూరణములేని బూరెయును, వాద్యములులేని వివాహమును సదాభిప్రాయము లేకుండా, విలువలేకుండా వ్యర్ధములై యుండును.
69.కూడనటువంటివి తెలుపుతుంది.
బంగారు కుదువఁబెట్టకు
సంగరమునఁ బాఱి పోకు, సరసుడవై తే
నంగడి వెచ్చము లాడకు,
వెంగలితోఁ జెలిమివలదు వినరా సుమతీ.
తా: స్వర్ణమును తాకట్టు పెట్టకుము, రణమునందు వెన్నుచూపి వెడలిపోకు(విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి), దుకాణమునందు సరుకులు అప్పు చేసి తీసుకురాకుము. మూర్ఖునితో చెలిమి తగదు.
70.వ్వవహార దక్షుని ప్రాధాన్యత వివరిస్తుంది.
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచుఁదరుచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపు గీ లూడినట్లు జరుగదు సుమతీ.
తా: సమర్థుడైన మంత్రి లేని రాజ్యము యంత్రములోని ప్రధానభాగము లేనపుడు ఏ విధముగా పని చేయునో అలాగే జరుగును. వ్యవహారములు చక్కబెట్టు మంత్రి వున్న రాజ్యము కార్యక్రమములు సక్రమముగా చెడకుండా జరుగును.
71.ఎవరి భాగ్యము వారికే ఉపయోగపడునని వివరించుతున్నది.
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్ష మెత్తగ వలసెన్
దనవారి కెంత గలిగిన
తనభాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ.
తా: తన భాగ్యమే తనకు ఉపయోగించును. అది ఏవిధముగానంటే ధనవంతుఁడైన కుబేరుఁడు స్నేహితుడైనప్పటికినీ ఆశ్రయించక సాక్షాత్ ఈశ్వరుడు భిక్ష ఎత్తుట జరిగెను. కాబట్టి, తనవారి కెంత ధనమున్నను తనకుపయోగపడదు.
72.కష్టమునకు తగిన ఫలితము ఇవ్వని వాని వద్ద పని చేయవద్దు.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁగొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.
తా: ఎంతగా అర్థించినను జీతము ఇవ్వనటువంటి అహంకారముతో నిండిన యజమాని యొక్క సేవలు చేసి నానా అవస్థలు పడుటకంటే వ్యవసాయభూమిని దున్నుకుని జీవించటం ఎంతో మేలు.
73.కష్టనష్టములను భరించువాడే ఉత్తముడు.
ఆఁకొన్న కూడె యమృతము,
తాఁకొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్,
సోకోర్చువాఁడె మనుజుడు,
తేఁకువగలవాడె వంశ తిలకుఁడు సుమతీ.
తా: మిక్కిలి ఆకలితో ఉన్నపుడు తీసుకున్నటువంటి ఆహారము అమృతముతో సమానమై తృప్తిని కలిగిస్తుంది.ముందు వెనుక ఆలోచించకుండా ఎవరైతే కష్టములలో ఉన్నవాడికి సహాయము చేస్తాడో వాడే దాత.భూమియందలి కష్ట నష్టములను ఓర్పుతో సహించువాడే తన వంశమునకు ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టువాడు.
74.కొద్దికాలం జీవించిన మంచిని చేయువాడే మోక్షమునకు అర్హుడు.
ఉడుముండదె నూఱేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁగొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్ధపరుఁడు గావలె సుమతీ.
తా: వంద సంవత్సరములు జీవించే ఉడుము అను జంతువు, వెయ్యి సంవత్సరాలు జీవించే పాము, చెఱువునందు చాలాకాలము బ్రతుకు కొంగ ఇవన్ని ఎన్ని సంవత్సరములు బ్రతికినను ప్రయోజనము ఏమి వుండదు. మంచిని చేయాలనే ఆలోచన కలిగియుండి పరులకు మేలు చేసేటటువంటి వాడు, ధర్మార్థకామమోక్షములను సాధించువాడు ఉత్తముడు. అటువంటివాని జన్మ ధన్యము . జీవితము నందు ఇటువంటి పనుల యందు ఎవరైతే ఆశ్రద్ధను కనబరుస్తారో వారు పైన చెప్పబడిన జీవులకంటే హీనుడు, పనికిరాని వాడని అర్థము చేసుకోవలెను.
75.అపకారికి కూడా ఉపకారము చేయువాడే గొప్పవాడు.
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.
తా: మేలు చేసినవారికి తిరిగి మేలు చేయటం గొప్ప విశేషం కాదు. ఎవరైతే మనకు కీడు చేస్తారో వారికి సహృదయముతో మేలు చేయటమే గొప్పతనము. ఇది నేర్పు కలవాడు చేసే పని.
76.సమయానికి తగినట్లు ప్రవర్తించువాడే ధన్యుడు.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుఁగువాఁడె ధన్యుఁడు సుమతీ.
తా: సందర్భానికి తగిన విధముగా మాటలు చెప్పి పరుల మనసులను, దుఃఖపెట్టక తాను కూడా దుఃఖపడక పనిని సక్రమంగా తీర్చిదిద్ది చక్కబెట్టువాడే ధన్యమైనవాడు.
77.ధనము చేరినపుడు అందరూ మన చుట్టూ తిరిగెదరు.
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ.
తా: అధికముగా కురిసిన వర్షముల వలన తెప్పలు తేలుతున్నప్పుడు కప్పలు ఆ చెఱువును ఆశ్రయించి యుండుట అనేది సర్వసాధారాణమైన విషయము.ఆ విధముగా ధనము మానవునిచెంత కూడినపుడు దరిద్రములో దూరమైన బంధువులందరూ మరల కప్పలవలె మనలని ఆశ్రయించెదరు సుమతి.
78.ఊరికి ఒక కరణము చాలును.
ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనగాఁక నొగిఁ దఱుచైనన్
గకవికలు గాక యుండునె?
సకలంబునుఁగొట్టుపడక సహజము సుమతీ.
తా: ఒక ఊరికి ఒక కరణమును, ఒక న్యాయాధికారి గాక అనేకమంది ఉన్నపుడు వారి యొక్క పనులన్ని నాశనమయి గందరగోళమవును.
79.పుట్టింటిలో భార్యను విడిచినవాడు ఉత్తమ భర్త కాడని దీని భావము.
కడు బలవంతుడైననుఁ
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ.
తా: పెండ్లాడిన మగవాడు తనతో వచ్చిన యువతిని ఆమె కన్నవారి ఇంటినందు ఎక్కువ కాలము విడిచివచ్చినచో అటువంటి పురుషుడు తానే స్వయంగా తన భార్యను వేశ్యా గృహమునకు తీసుకువెళ్ళినట్లే అవుతుంది.
80.ఏ స్త్రీని కోరుటకు తగదో ఇందులో తెలుపుతున్నారు.
కాముకుడు దనిసి విడిచినఁ
కోమలిఁ బరవిటుఁడు గవయఁ గోరుటయెల్లన్
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ.
తా: పురుషులు ఎటువంటి స్త్రీని ఆశించకూడదో తెలుపుతుంది ఈ భావము. స్త్రీయందు కోరిక కలిగిన పురుషుడు తన కోరిక తీరునంతవరకు అనుభవించి ఆ తరువాత వదిలివేసిన స్త్రీని వేరొక పురుషుడు అనుభవించుటకు సిద్ధపడితే అది ఎలావుంటుందంటే చెరకుయొక్క వ్యర్ధమును చీమలు పీల్చుకొనుటకు వచ్చినట్లే యుండును.
81.దుష్టుల స్నేహము ఎటువంటిదో ఇందులో తెలుపుతున్నారు.
కొంచెపు నరు సంగతిచే
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుఁ బెట్లువచ్చు మహిలో సుమతీ.
తా: దుష్టుల సహవాసము ఎలాంటిదనగా మంచము మీద నిద్రించినపుడు నల్లి కుట్టడం వలన నల్లిని కాక మంచమును మనము ఎట్లు తంతామో అదేవిధంగా దుష్టబుద్ధి గలవాడి యొక్క స్నేహము కూడా మనలకు అదే అపాయమును కలిగించును.
82.ధనమునకు గల ప్రాధాన్యత తెలుపుతుంది ఈ పద్యము.
కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁడైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి రొక్కము నీయక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ.
తా: ఎంత రతి శాస్త్రమంతయు చదివినవాడైనను, మహా అందము గలవాడైనను, రాజులలో ఉత్తముడయిన, ధనమీయకుండా వేశ్య లభించదు.
83.మంచి ప్రవర్తన గురించి వివరణ ఇస్తుంది ఈ పద్యము.
చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మానుమిదియె మతముర సుమతీ.
తా: అయిపోయిన వ్యవహారమును గురించి ఆలోచించి దుఃఖపడకు.స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకముంచకు.అంతఃపురములో నివసించు స్త్రీలతో రహాస్య మంతనాలు చేయకుము. ఇవి చేసినవాడు మంచి ప్రవర్తనను కలిగి యున్నట్లే సుమా.
84.ఓర్పు, సహనము యొక్కప్రాధాన్యతలను వివరించుతున్నారు.
తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడిన గార్యంబగునే
తడవోర్చిన నొడ లోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ.
తా: తొందర ఏ పనికి పనికిరాదు. అందువలన పనులు అవక పోవటం అటువంచితే లేనిపోని బాధలు కూడా కలుగును. అందుకే ఆలస్యమును, శ్రమను భరించి సహనమును ప్రదర్శించినచో సక్రమముగా జరగని పనులు కూడా సమకూరును.(ఆలస్యమును, శ్రమను ఓర్పుతో భరింపక వెంటవెంటనే పనులు కావాలని వేగిన పడినచో ఏ పని కాదు.)
85.అల్పమయిన వాటిని గురించి తెలుపుతున్నారు.
తమలము వేయని నోరును
విమతులతోఁ జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమధాముఁడులేని రాత్రి హీనము సుమతీ.
తా: అల్పమయిన వస్తువులుగా ఈ క్రింది వాటిని పేర్కొన్నారు.తాంబూలము గ్రహించని నోరును, విరుద్ధమైన అభిప్రాయము గలవారితో మిత్రత్వము చేసి ఆ తరువాత బాధపడు వివేకమును, తామర పువ్వులు లేని చెఱువు, చంద్రుడు కనపడని రాత్రి.
86.అసహ్యించుకొనునంటివి ఈ పద్యమునందు వివరించినారు.
తలమాసిన, వొలు మాసినఁ,
వలువలు మాసిననుఁ బ్రాణవల్లభు నైనన్
కులకాంతలైన రోఁతురు,
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ.
తా: లోతుగా విచారించి చూడగా తలయు, శరీరమును, బట్టలు మాసినచో భర్తయైననూ,వివాహం చేసుకున్న స్త్రీ అసహ్యించుకొనుట నిజము. ఇది భూమియందు సహజమైనది.
87.ప్రభువులు చెప్పుడు మాటలు వింటే ఏమగునో ఈ పద్యమునందు వివరించుచున్నారు.
దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ.
తా: మంత్రి చెప్పు అబద్ధము మాటలను విని, రాజు ప్రజలకు హాని చేయుట కోరిన కోరికలనిచ్చు చెట్టును బొగ్గులకై నరుకుటతో సమానము.
88.మనుషులు ప్రవర్తన ఏ విధముగా ఉండాలో తెలుపుతుంది.
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ.
తా: ఎవరూ తోడు లేకుండా మార్గమునందు ఒక్కడివే నడువకుము. సన్నిహితము లేనటువంటి శత్రువు ఇంట ఆహారము తీసుకొనవద్దు.ఇతరుల ధనములను కాజేయకు. ఇతరుల మనసులు బాధపడు విధముగా ప్రవర్తించకుము. అది మంచిది కాదు.
89.బెదిరించుట కొన్ని సందర్భాలలో తగుననే తెలుపుతుంది.
నయమున బాలుం ద్రావరు
భయమున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ.
తా: భయము కొన్ని వేళల చూపించవచ్చును. అది ఏ విధముగానంటే మంచి బుద్ధిచేత పాలును త్రాగించలేక పోయినా, భయంతో విషమునైనను తినిపించవచ్చును.
90.హద్దులు మీరితే ఏమగునో తెలియజేశారు.
నరపతులు మేర దప్పిన,
దినమొప్పగ విధవ యింట దీర్పరియైనన్.
గరణము వైదికుఁడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ.
తా: రాజులు ధర్మము యొక్క హద్దు తప్పినను, విధవ స్త్రీ యింటి యందెల్ల కాలము పెత్తనము చేసినను, గ్రామ కరణము వైదిక వృత్తి గలవాడైనను ప్రాణము పోవునంతటి కష్టము తప్పకుండా సంభవించును.
91.మనిషి ఉండకూడనటువంటి స్థానములు తెలుపుతుంది.
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమయిన చోటను,
మనుజున కట నిలువఁదగదుఁ మహిలో సుమతీ.
తా: మానవుడు తన సొంతవారు,బంధువులు లేని స్థానమున, తనకు సరిపడనటువంటి స్థానమున, తనపై అనుమానము కలిగిన చోట తన నీడను కూడా నిలుపరాదు.ఇది సత్యము సుమా!
92.మూర్ఖుని యొక్క తీరును తెలుపుతుంది ఈ పద్యము.
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ.
తా: మూర్ఖులకు శృంగారాది నవరసములతోడను భావములతోడను అలంకరింపబడిన కవిత్వ ప్రసంగమును, మిక్కిలి వినసొంపైన పాటయును ఎంత తెలియజేసినను, చెవిటివాడికి శంఖమునూదినట్లె! శ్రమ వృధా యగునే కాని అటువంటివారికి అర్థము కాదు.
93.చేయకూడనటువంటివి తెలుపుతుంది.
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ.
తా: శత్రుత్వము ఎవరితోనయినా తగదు. ధనము ఉన్నపుడే జాగ్రత్తపడాలి కాని పేదరికము సంభవించిన తరువాత బాధపడరాదు; సభలలో నిర్మొహమోటముగా మాట్లాడ రాదు .స్త్రీకి మనసులో ప్రేమను వ్యక్తపరచరాదు.
94.అపవాదు పాలగుటకు గల అవకాశములు తెలుపుతుంది.
పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁడు గాంగేయుఁడైన భువిరని దవడున్,
బరసతి సుశీలయైనను,
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ.
తా: భీష్ముడంతటి పురుషుడైనను ఇతర స్త్రీల యొక్క ప్రసంగములో పాల్గొన్నచో అపవాదుపాలగును(సాక్షాత్ భీష్ముడైనప్పటికి).అలాగే ఉత్తమ స్త్రీ పరపురుషునితో సన్నిహితముగా ఉండినచో లోకాపవాదుకు గురి కాగలదు.
95.సహించకూడనటువంటివి తెలుపుతుంది.
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలోన
గర్వింపఁ నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ.
తా: పండుగ రోజులందు స్త్రీలను కూడకుము. పాలించు ప్రభువు చూపించు కరుణను చూసి సంబరపడకుము. అహంకారముతో ఎగిరిపడు భార్యను భరించు పోషింపకుము. బాగు ఎరుగని గ్రామమును నివాసముగా చేసుకోవద్దు.
96.జీవులకు ఆభరణముల వంటి మంచి గుణాలను ఇందులో వివరించుతారు.
చేతులకు తొడవు దానము.
భూతలనాథులకుఁదొడవు బొంకమి, ధరలో
నీతియె తోడ వెవ్వారికి,
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ.
తా: చేతులకు దానము చేయుట, రాజులకు అసత్యమాడకుండుట, భూమియందు ఎవ్వరి కయినను న్యాయమును, స్త్రీకి శీలము ఆభరణము వంటిది.