Literature | Padyalu | Vemana Shatakam (వేమన శతకం)

A collection of poems preaching great morals written by Vemana Kavi.

1. అన్నింటిలోను ఘనమైన వాటి గురించి తెలుపుతుంది.

అన్నిదానములను నన్నదానమె గొప్ప

కన్నతల్లికంటె ఘనములేదు

ఎన్న గురునికన్న నెక్కుడులేదయా

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.

2.

కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు

సత్యమాడువాని స్వామి యెఱుగు

బెక్కుతిండిబోతుఁబెండ్లా మెఱుంగురా

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.

3.

ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపేగాని తెలుపురాదు

కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.

4.

పాల నీడిగింట గ్రోలుచునుండెనా

మనుజులెల్లఁగూడి మద్యమండ్రు

నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: ఈడిగవాని ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ గూడని స్థలములో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.

5.

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు

మాటకన్న నెంచ మనసు దృఢము

కులముకన్న మిగుల గుణము ప్రధానంబు

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

6.

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

భాండశుద్ధి లేని పాకమేల?

చిత్తశుద్దిలేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

7.

మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు

బరిఢవిల్లు దాని పరిమళంబు

గురువులైన వారి గుణము లీలాగురా

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.

8.

రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె

కురపతి జనియించి కులముజెఱచె

ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: రాముడు వంటి గొప్ప వ్యక్తి జన్మించినందు వలన సుర్య వంశం నేటికీ విఖ్యాతి చెందినది. దుర్యోదనుడు జన్మించి మొత్తం కురు వంశానికే అపఖ్యాతి తెచ్చాడు. ఇవే పాప పుణ్యముల ఫలితములు.

9.

కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు

విద్యచేత విఱ్ఱవీగువాఁడు

పసిడి గలుగువాని బానిస కొడుకులు

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: మంచి కులము గలవాడు, మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.

10.

కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును,

నీరు పల్లమెరుగు నిజముగాను

తల్లితానెరుగు తనయుని జన్మంబు

విశ్వదాభిరామ! వినురవేమ!



తా: నీరు పల్లమెరుగును, సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.